కంగనను.. ఊర్మిళ తట్టుకుంటుందా..?

NAGARJUNA NAKKA
ఒక్క సినిమాతో ఇండియాని ఊపేసింది ఊర్మిళా మతోంద్కర్. రంగీలాతో కుర్రకారు మతి పోగొట్టింది. కంగన కూడా తక్కువేమీ కాదు. బాలీవుడ్‌లో హాట్ అండ్ స్పైసీ గాళ్ అంటే ముందు గుర్తొచ్చేది కంగనే. సినిమాలు లేకపోవడంతో.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రంగీలా బ్యూటీ. కంగన సినీ కెరీర్‌తో పాటు పాలిటిక్స్ మీద కూడా దృష్టి పెట్టింది. వెండి తెర మీద వేడి రగిలించడంతో పాటు.. మాటలతో మంటలు పుట్టించే కంగనను తట్టుకోవడం ఊర్మిళకు సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

బాలీవుడ్‌లో హాట్ బ్యూటీ.... తెర మీద కనిపిస్తే చాలు.. కుర్రకారు గుండెలు చెల్లాచెదురవాల్సిందే. గ్లామర్‌తో పాటు పెర్‌ఫామెన్స్‌తోనూ ఆకట్టుకుంది హిమాచల్ ప్రదేశ్ అందం.  ఏ పాత్ర ఇచ్చినా సరే.. దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది.

సినిమాలు... నటనే కాదు.. వివాదాల్లోనూ కంగనా రనౌత్ నెంబర్ వన్. పాత బాయ్‌ఫ్రెండ్ హృతిక్ రోషన్‌తో మొదలు పెడితే.. తాప్సీ, స్వర భాస్కర్ కూడా ఆమెకు శత్రువులు. ఒక్కోసారి నేరుగా.. మరోసారి సోషల్ మీడియాలో తన ప్రత్యర్థులతో కరుకైన మాటలతో విరుచుకు పడుతుంటారు కంగన. మీటూ  ఉద్యమం కావచ్చు, డ్రగ్స్ వ్యవహారం కావచ్చు.. తన అభిప్రాయాన్ని, తనకు తెలిసిన దాన్ని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పేస్తారు.

కంగనకు బీజేపీ అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. మహారాష్ట్రలో ప్రస్తుతం ఆమె ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. కంగన బీజేపీ కండువా కప్పుకోకపోయినా.. అనేక అంశాల్లో ఆ పార్టీ అజండాను ఫాలో అవుతున్నారు. బ్రిటిషర్లు రాక ముందు భారత్ అనే భావన లేదన్న సైఫ్ వ్యాఖ్యలపై కంగన విరుచుకు పడ్డారు. భారత్ అనేది లేకపోతే మహా భారత్ ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. దీపికా పదుకొణే జేఎన్‌యూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతివ్వడంపై సెటైర్లు వేశారు. కంగన లైఫ్‌లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

సుశాంత్ రాజ్‌పుత్ మరణం వరకూ బాలీవుడ్‌తో ఫైట్ చేస్తున్న కంగన.. డ్రగ్స్ వ్యవహారం బయట పడిన తర్వాత నేరుగా మహారాష్ట్ర సర్కారుతో ఢీ అంటున్నారు. ఆమెను ఎదుర్కోవడం ఉద్దవ్ థాకరేకు కొంత ఇబ్బందికరంగా ఉంది. కంగనకు సరైన జోడీ ఎవరా అని వెదికి మరీ.. ఊర్మిళకు పార్టీ కండువా కప్పారాయన. ఊర్మిళ ఇప్పుడు కంగనను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్‌ స్టార్ అంటూ గతంలోనే కంగన ఘాటుగా అటాక్ చేసింది. ఆమె మరోసారి తన నోటికి పదును పెడితే.. రంగీలా బేబీ కూడా రంగంలోకి దిగక తప్పకపోవచ్చు.

వీళ్లిద్దరి వివాదం.. ఆరోపణలు.. విమర్శల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. కాకుంటే ఎప్పుడూ సీరియస్‌గా ఉండే మరాఠా రాజకీయాల్లో ... కాస్త ఎంటర్‌టైన్ మెంట్‌ పెరిగే అవకాశం ఉంది. ఇన్నాళ్లుగా తెరపై వినోదం పంచిన తారలిద్దరూ.. ఇప్పుడు పాలిటిక్స్‌లో అలాంటి పాత్ర పోషిస్తారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: