మరికొన్ని గంటల్లో నాగబాబు కూతురు..!
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం.. మరికొన్ని గంటల్లో జొన్నలగడ్డ చైతన్యతో జరగనుంది. ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్.. ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఇప్పటికే అక్కడకు చేరుకున్న మెగా ఫ్యామిలీ.. ప్రీవెడ్డింగ్ సంబరాల్లో మునిగితేలుతోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యారు. ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్‌తో పాటు తనయుడు అకీరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
సంగీత్ వేడుకలో నిహారిక-చైతన్యలతో పాటు మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు. కాబోయే వధూవరులు పలు పాటలకు నృత్యాలు చేశారు. ముఖ్యంగా చిరంజీవి నటించిన చిత్రాల్లోని పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు.
నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలంతా సందడి చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ..సంగీత్‌లో చిందులేశారు. అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో అభిమానులు తెగ లైక్‌లు కొడుతున్నారు
మెగాస్టార్ చిరంజీవి, నిహారికకు.. ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండుకోట్ల రూపాయల విలువైన ప్రత్యేక ఆభరణాన్ని నిహారికకు అందించారట చిరు. ఈ సందర్భంగా చిరంజీవి ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు నిహారికను ఎత్తుకున్న ఫొటోతో పాటు, ఇటీవల పెళ్లి కుమార్తెను చేసిన తర్వాత దిగిన సెల్ఫీని కలిపి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మొత్తానికి నీహారిక మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతోంది.
నీహారిక పెళ్లికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజస్థాన్ లోని ప్యాలెస్ వాతావరణం సందడి సందడిగా మారింది. బంధువులు.. ఆప్తులతో కళకళ లాడుతోంది. పెళ్లిలో మెగా వారసులంతా ఉండటంతో మెగా అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఎలా ఉంటారో అనే ఉత్కంఠ వారిలో నెలకొంది.