రాజమౌళి పవన్ కళ్యాణ్ ల సమావేశంతో అభిమానులలో ఉప్పొంగిన ఆనందం !
పవన్ కళ్యాణ్ వరసపెట్టి సినిమాలు చేయడమే కాకుండా ఇంచుమించు తన దగ్గరకు వచ్చిన ప్రతి మూవీ ఆఫర్ కు ఓకె చేసి అందరికీ షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ‘అయ్యప్పన్ కొషియం’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ఉన్న పాత అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన కొన్ని పెండింగ్ ఫైట్ సీన్స్ రాజమౌళి చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాడట. రాజమౌళి తన పక్కనే ఉన్నాడు అని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా ‘అర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ లోకి వెళ్ళి రాజమౌళిని మర్యాద పూర్వకంగా కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ అనుకోని అతిధి ని చూసిన రాజమౌళి షాక్ అవ్వడమే కాకుండా ఎంతో స్నేహ పూర్వకంగా పవన్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన అనేక విషయాలు షేర్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో భవిష్యత్ లో రాజమౌళి పవన్ ల కాంబినేషన్ లో మూవీ ఉంటుంది అంటూ పవర్ స్టార్ అభిమానులు అప్పుడే కలలు కంటున్నారు. వాస్తవానికి రాజమౌళి మహేష్ తో సినిమా చేయడానికి ఇప్పటికే ఫిక్స్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితులలో పవన్ అభిమానుల కలలు నెరవేరాలి అంటే మరో మూడు సంవత్సరాలు పట్టవచ్చు. అయితే ఈ విషయం పై పవన్ అభిమానుల ఊహాగాలు మరింత ఎక్కువగా కొనసాగుతూనే ఉంటాయి..