ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

Chakravarthi Kalyan
సినిమా రంగం.. ఎందరినో ఆకర్షిస్తుంది.. కానీ కొందరే స్టార్స్‌ అవుతారు. అందులో ఇంకొందరే తన స్టార్‌ డమ్‌ను నిలబెట్టుకుంటారు. కొందరే తమ విశిష్ట వ్యక్తిత్వంతో ఆ స్థాయి అందుకుంటారు. అయితే సినిమా స్టార్ల మధ్య కొన్ని సార్లు వివాదాలు వస్తుంటాయి. అపార్థాలు, అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఈ చిన్న కథ. గతంలో ఓసారి ఎన్టీఆర్, కృష్ణల మధ్య వచ్చిన ఈ వివాదం గురించి ఓ సీనియర్ జర్నలిస్టు గుర్తు చేసుకున్నారు.


అసలేం జరిగిందంటే.. తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో సొంత సినిమా తీయాలనుందని హీరో కృష్ణ విజయవాడలో జరిగిన పండంటి కాపురం చిత్ర శతదినోత్సవ సభలో ప్రకటించారు. వేదికపైనే ఉన్న ఎన్టీఆర్‌ వెంటనే ఆమోదించారు. మద్రాసుకు వెళ్లాక కృష్ణకు ఫోన్‌ చేసి, బ్రదర్‌.. సినిమా చేస్తానన్నారు కదా. మేం రెడీ అన్నారు. వాస్తవానికి పండంటి కాపురం తర్వాత వి.రామచంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా తీసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నారట కృష్ణ. రచయిత మోదుకూరి జాన్సన్‌ కథ కూడా సిద్ధం చేశారు.


అనూహ్యంగా ఎన్టీఆర్‌ సినిమా చేస్తాననడంతో ఆ కథ పక్కన పెట్టి, ఇద్దరు హీరోలతో మరో కథను తయారు చేయించారట. కథను ఎన్టీఆర్‌కు వినిపించడమే మిగిలిందట. అయితే అనుకోకుండా అప్పుడే ఓ పరిణామం జరిగింది. సరిగ్గా ఆ సమయంలో జై ఆంధ్రా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. ఆ పరిస్థితులను చూసి చలించిపోయిన హీరో కృష్ణ జై ఆంధ్రా ఉద్యమానికి మద్దతు ఇస్తూ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆవేశంలో కృష్ణ తాను ఒక్కడే ఆ ప్రకటన ఇచ్చారు. దీంతో అంతవరకూ ఆ ఉద్యమ విషయంలో తటస్థంగా ఉన్న అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ ఇబ్బంది పడ్డారు.


జనం కూడా కృష్ణ రియాక్షన్ చూసి.. ఇదే రియాక్షన్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఆశించారు. నాగేశ్వరరావు గారు అందాల రాముడు షూటింగ్‌ కోసం వెళ్తే.. ఆయన దగ్గరికి స్టూడెంట్స్‌ వెళ్లి జై ఆంధ్రా అనాలంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళితే అక్కడకూ విద్యార్థులు వచ్చి ఆందోళన చేశారట. దీంతో ఎన్టీఆర్ మండిపడ్డారట. కృష్ణ చేసిన పని బాగోలేదంటూ సినిమా  అసోసియేషన్‌ నుంచి తప్పుకొంటున్నానని ప్రకటించారట. ఆ తర్వాత కొన్నాళ్లకు గొడవ సద్దుమణిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: