చిరంజీవి పక్కన ఆ పాత్రలో నటించడానికి తిరస్కరించిన విజయశాంతి ?
చిరంజీవి మెగా హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో చిరంజీవి విజయశాంతి ల కాంబినేషన్ లో మూవీ వస్తే చాలు ఆ మూవీ పై భారీ అంచనాలు ఉండేవి. దీనికితోడు వీరి కాంబినేషన్ కు ఆనాటి ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో వీరిద్దరూ కలిసి నటించిన అనేక సినిమాలు అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్స్.
ఇప్పుడు విజయశాంతి సరిలేరు నీకెవ్వరు మూవీతో తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన పరిస్థితులలో చిరంజీవి విజయశాంతిల కాంబినేషన్ ను తిరిగి రిపీట్ చేయాలని ప్రయత్నించిన ఒక దర్శకుడు ప్రయత్నాలకు విజయశాంతి నుంచి స్పందన రాలేదు అన్నవార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవితో ‘లూసీఫర్’ రీమేక్ ను తెలుగులో తీస్తున్న దర్శకుడు మోహన్ రాజా ఈ మూవీలో అత్యంత కీలకమైన చిరంజీవి చెల్లెలు పాత్రను పోషించమని విజయశాంతిని అడిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ రాయబారానికి విజయశాంతి స్పందించలేదు అని అంటున్నారు. దీనితో ఈ పాత్రను నయనతార తో నటింప చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆ ప్రయత్నాలకు కూడ నయన్ దగ్గర నుంచి కూడ స్పందన లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ దర్శకుడు అనేక ప్రయత్నాలు చేసి చివరకు ఈ మూవీలోని చెల్లెలి పాత్రకు త్రిషను ఫిక్స్ చేసినట్లు టాక్.
వాస్తవానికి త్రిష ‘ఆచార్య’ మూవీలో హీరోయిన్ గా మొదట్లో ఎంపిక అయింది. అయితే ఆ తరువాత ఆ మూవీలోని తన పాత్ర నచ్చకపోవడంతో త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలో కాజల్ ను ఎంపిక చేసారు. అలాంటి త్రిష ఇప్పుడు చిరంజీవి పక్కన ‘లూసీఫర్’ రీమేక్ లో చెల్లెలుగా నటిస్తున్నట్లుగా వార్తలు రావడం ఆమె ప్రోఫిషినల్ లుక్ కు తార్కాణం అంటూ ఆమె పై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో త్రిష చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు ఆమె చిరంజీవి పక్కన చెల్లెలుగా నటిస్తే ఎంతవరకు ప్రేక్షకులు అంగీకరిస్తారో చూడాలి..