వివాదాలలో చిక్కుకున్న సారంగ దరియా !

Seetha Sailaja
‘లవ్ స్టోరీ’ మూవీ పై ఉన్న అంచనాలను లేటెస్ట్ గా విడుదలైన ‘సారంగ దరియా’ పాట మరింత పెంచింది. ఈ పాట విడుదలైన కొన్ని గంటలలోనే ఆ పాట ట్రెండింగ్ గా మారిపోవడమే కాకుండా ఈ పాటలో సాయి పల్లవి వేసిన స్టెప్స్ కు జనం ఫిదా అయిపోతున్నారు. ఈ పాటకు సంబంధించిన మ్యానియా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఈ పాట కాపీ వివాదాలలో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.


వరంగల్ జిల్లాకు చెందిన జానపద గాయని కోమలి ఈ పాట ట్యూన్ అదేవిధంగా ఈ పాటలోని సాహిత్యం తన క్రియేటివిటీ అని చెపుతూ ఈపాటను తనకు తెలియకుండా కాపీ కొట్టి ‘లవ్ స్టోరీ’ మూవీలో ఉపయోగించుకోవడం అన్యాయం అంటూ ఆమె మీడియాకు ఎక్కింది. అంతేకాదు ఆమె తాను ఈ పాటను ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ‘రేలా రే రేల’ కార్యక్రమంలో పాడానని ఆపాటకు ఆ కార్యక్రమంలో మంచి స్పందన కూడ వచ్చిన విషయాన్ని కోమలి గుర్తుకు చేసుకుంది.


వాస్తవానికి ఈపాటను ‘లవ్ స్టోరీ’ మూవీలో ఉపయోగించుకున్న విషయం తనకు తెలియదనీ లేటెస్ట్ గా ఆ మూవీకి సంబంధించి విడుదల చేసిన ‘సారంగ దరియా’ పాట విని తాను షాక్ అయిన విషయాన్ని మీడియా వర్గాలకు తెలియ చేసింది. ‘లవ్ స్టోరీ’ లోని ఆ పాట విన్నతరువాత తాను దర్శకుడు శేఖర్ కమ్ములను కాంటాక్ట్ చేసి ఆ పాటను తన చేత కాకుండా వేరే సింగర్ తో పాడించడం ఏమిటి అని అడిగితే శేఖర్ కమ్ముల నుండి సరైన స్పందన రాకపోవడమే కాకుండా ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ పూర్తి అయింది కాబట్టి ఇక తాను చేయదగినది ఏమిలేదు అని అర్థం వచ్చేలా శేఖర్ కమ్ముల మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్త పరిచింది.


అంతేకాదు ఈపాట తెలంగాణ జానపద సాహిత్యంలో ఎప్పటి నుండో వాడుకలో ఉన్న పరిస్థితులలో దీనికి సుద్దాల అశోక్ తేజా కు పాట రచయితగా ఎలా క్రెడిట్ ఇస్తారు అంటూ కోమలి ప్రశ్నిస్తోంది. అయితే ఈ విషయమై సుద్దాల అశోక్ తేజా స్పందన వేరే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోమలి ‘రేలా రె రేల’  కార్యక్రమంలో ఆ పాట పాడిన విషయం వాస్తవమే అనీ అయితే ఆ పాట పల్లవి లోని కొన్ని పదాలు మాత్రమే తాను తీసుకుని మిగతా చరణాలను తాను సొంతంగా వ్రాసాను అని అంటున్నాడు..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: