వీధి కెక్కిన బాలీవుడ్ హీరోలు

Prasad
బాలీవుడ్ చిత్ర సీమలో మరో వివాదం చోటు చేసుకుంది. ఇద్దరు హీరోలు తమ సినిమా విడుదల విషయంలో గొడవ పడుతున్నారు. అజయ్ దేవగన్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్’ (మర్యాద రామన్న రీమేక్), షారుఖ్ ఖాన్ నటించిన ‘జబ్ తక్ హై జాన్’ సినిమాలను ఒకే రోజున నవంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇటీవలే స్వర్గస్తులైన యాశ్ చోప్రా దర్శకత్వం వహించిన చివరి చిత్రం కాబట్టి, ఆయనకు నివాళిగా జబ్ తక్ హై చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేద్దామని షారుఖ్ చేసిన ప్రతిపాదనను అజయ్ దేవగన్ తిరస్కరించాడు. అంతేకాకుండా, యాశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రాతో కలిసి షారుఖ్ ఖాన్ తన సన్నాఫ్ సర్దార్ సినిమాకు ధియేటర్లు దొరకుండా చేస్తున్నాడని ‘కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా’కు ఫిర్యాదు చేశాడు. అయితే, తాము ఎవరిపైనా ఒత్తిడి తేలేదనీ, తమ సంస్థకున్న పేరు వల్లే ఎగ్జిబిటర్లు తమకు థియేటర్లు కేటాయించారనీ యాష్ రాజ్ ఫిల్మ్స్ చెబుతోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో తమ తీర్పు వెలువరిస్తామని కాంపిటీషన్ కమీషన్ పేర్కొంది. కాగా, అజయ్ దేవగన్-షారుఖ్ ల మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. షారుఖ్ ఖాన్ ను సూపర్ స్టార్ చేసిన డర్ చిత్రంలో ముందు ఆ పాత్రకు అజయ్ దేవగన్ నే తీసుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో షారుఖ్ ఖాన్ పావులు కదిపి ఆ పాత్రను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి షారుఖ్ అంటే దేవగన్ కు అస్సలు పడదు.  పైగా సన్నాఫ్ సర్దార్ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన సల్మాన్ ఖాన్ కు షారుఖ్ అంటే అస్సలు పడదు. దాంతో సన్నాఫ్ సర్థార్ సినిమా విడుదల వాయిదాకు అజయ్ అంగీకరించకుండా సల్మాన్ అడ్డుపుల్ల వేస్తున్నాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: