సత్యమూర్తి థాంక్స్ మీట్ లో బన్నీ షాకింగ్ కామెంట్స్ !
నిన్న సాయంత్రం విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రం ప్రాంగణంలో కురుస్తున్న వర్షం సాక్షిగా జరిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ థాంక్స్ గివింగ్ మీట్ లో అల్లు అర్జున్ మీడియాను టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లు అల్లుఅర్జున్ మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన కెరియర్ లో తాను నటించిన ఏ సినిమాకు ఇంత బ్యాడ్ రివ్యూస్ రాలేదు అని అంటూ దానివల్ల సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ఆవ్యతిరేక పరిస్థితులను ఎదిరిస్తూ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ క్రియేట్ చేసిన రికార్డులు తన అభిమానులకు అంకితం చేస్తున్నానని బన్నీ రెచ్చి పోయిన ఉత్సాహంతో వైజాగ్ లో హంగామా చేసాడు.
కొంతమంది సినిమాలను బుర్రకు పదును పెట్టే పజిల్ గా భావిస్తూ చూస్తారని కానీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాను గుండెకు హత్తుకునే సినిమాగా చూడాలని అలా చూడని వారికి సత్యమూర్తి సినిమా అర్ధం కాదని తన స్పీచ్ ని ఒక పజిల్ గా మార్చి మాట్లాడాడు అల్లుఅర్జున్. అయితే ఎప్పుడూ జరిగే విధంగానే బన్నీ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రస్తావనను తమ అరుపులు కేకలు రూపంలో తీసుకు రావడంతో పవన్ గురించి మాట్లాడకుండా కుదరదు కదా అని అంటూ తనకన్నా త్రివిక్రమ్ ఈ విషయమై బాగా మాట్లాడుతాడు అని తెలివిగా తప్పించుకున్నాడు బన్నీ.