మమ్ముట్టి సినిమా కేరళ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా...?

VAMSI
మన దేశంలో రకరకాల సినీ పరిశ్రమలు ఉన్నాయి. అదే విధంగా ఒక్కో ఇండస్ట్రీలో ఒకో మెగాస్టార్ ఉన్నారు. తెలుగులో మనకు చిరంజీవి మెగాస్టార్ అయితే మలయాళంలో మమ్ముట్టి మెగాస్టార్. వీరి సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు ప్రేక్షకులకు పండగే పండుగ. తాజాగా మమ్మోట్టి నటించిన చిత్రం "వన్". ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంతోష్ విశ్వనాధ్ దర్శకత్వం వహించాడు మరియు బాబీ సంజయ్ ఈ చిత్రానికి కథను అందించడం జరిగింది. ఈ చిత్రంలో మమ్ముట్టి కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నటించారు. ఎన్నో అంచనాల మధ్యన ఈ చిత్రం నిన్న విడుదల అయింది.

ఈ సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ లో మమ్ముట్టి పలికిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. ఒక రాజకీయ నాయకుడి పాత్రలో ఇట్టే ఒదిగి పోయాడు. రాజకీయాలలో ప్రధమ ఉద్దేశ్యం ప్రజాసేవ...అయితే ఇలాంటి లక్ష్యంతో రాజకీయాల్లో అడుగుపెట్టి, ముందు ముందు ఎన్నెన్ని అడ్డంకులను ఎదుర్కొని ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అనేది సినిమా కథాంశం. ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి ఎటువంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు. ప్రతిపక్షాల కుట్రల నుండి ఎలా బయటపడ్డాడో ఇందులో చూపించారు. అయితే ఈ సినిమాకి అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదన్నది క్రిటిక్స్ అభిప్రాయం.

ఈ సినిమాలో తన పాత్ర వరకు న్యాయం చేశారని చెబుతున్నారు. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించారని అంటున్నారు. అయితే అన్ని రాజకీయ కథలు సినిమాలుగా సక్సెస్ కావు. ఈ కథలన్నీ వినడానికి బాగుంటాయి. కానీ సినిమా రూపంలో తీసుకువస్తే నిరాశ పరుస్తాయి. ఈ సినిమాకు ఆయువుపట్టు అయిన క్లైమాక్స్ మాత్రం బాగుందని టాక్ వచ్చింది. ఈ చిత్రానికి మన తెలుగు యువ సంగీత దర్శకుడు గోపీ సుందర్ సంగీతం అందించారు. అయితే కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితుల్లో ఈ సినిమాని విడుదల చేయడానికి కారణం త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారికీ అవగాహన కలిగించడానికి తీసిన ప్రయత్నమని భోగట్టా... మరి ఈ  సినిమా  ఏ రాజకీయ పార్టీకి సంబంధించిందో...ఏ నాయకుడిని ఉద్దేశించి తీశారో వారికే తెలియాలి. మొత్తానికి ఎన్నికల ముందు ప్రజలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి చూద్దాం కేరళ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో...?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: