మరోసారి అభిమానులు సర్ ప్రైజ్ చేయనున్న పవర్ స్టార్..!
ఇక పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తన అభిమానులను ఫిదా చేయనున్నారు. మరోసారి ఆయన గాయకుడిగా అవతారమెత్తనున్నారు. ఆయన కథానాయకుడిగా ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్ ఓ పాటపాడనున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తెలిపారు.
అయితే ‘వకీల్‌సాబ్’ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కల్యాణ్‌కు సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలకు సంగీతం అందించాలని ఎప్పటి నుంచో నాకు ఓ కోరిక ఉంది. ‘వకీల్‌సాబ్’తో నా కల నెరవేరింది. అలాగే ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌కు కూడా సంగీతం అందిస్తున్నాను. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ రీమేక్ కోసం పవన్ ఓ పాట పాడనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే ‘వకీల్‌సాబ్’, ‘అయ్యప్పనుమ్ కోషియం’ ప్రాజెక్ట్‌లలో నేను భాగమయ్యాను’ అని తమన్ చెప్పారు.
అంతేకాదు.. పవన్ ఇప్పటికే ఎనిమిదిసార్లు తన పాటలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. తమ్ముడులో ‘ఏమ్ పిల్ల మాటాడవా’, ‘తాటిచెట్టు ఎక్కలేవు’ పాటలతో మెప్పించిన పవన్ ‘ఖుషి’లో ‘బై బయ్యే బంగారు రమణమ్మ’ జానపదగీతంతో అలరించారు. అనంతరం ‘జాని’లో ‘నువ్వు సారా తాగుటమానురన్నో’, ‘రావోయి మా ఇంటికి’, ‘పంజా’లో ‘పాపారాయుడు’, ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా’, ‘అజ్ఞాతవాసి’లో ‘కొడకా కొటేశ్వరరావు’ పాటలతో పవన్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేశారు.