ఈ సినిమాలపై సమ్మర్ ఆధారపడి ఉందా...?

VAMSI
ప్రస్తుతం మరోసారి కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా వణుకుతోంది. ముఖ్యంగా భారతదేశం బిక్కు బిక్కు మంటోంది. ఇప్పటికే గతంలో కరోనా వలన అనుభవించిన కష్టాలు ఒక్కసారిగా కళ్ళముందు మెదలాడుతున్నాయి. మరో సారి ఇలా లాక్ డౌన్ కనుక పడితే, అసలు ఆ ఊహే భరించడానికి కష్టంగా ఉంది. చూస్తుంటే ఇది జరిగేలా అనిపిస్తోంది. కరోనా మెల్ల మెల్లగా తన ప్రభావాన్ని మరోసారి చూపుతోంది. కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనితో సినిమా పరిశ్రమను ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమై కరోనాను నియంత్రించేందుకు ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో కరోనా పెరగడంతో అక్కడ సినిమా థియేటర్లని బంద్ చేశారు మరియు మరి కొని రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలులో ఉంది.
అయితే అతి త్వరలోనే తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సినిమాను ఏప్రిల్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా మేకర్స్ ఖచ్చితంగా మొదటి వారం మంచి కలెక్షన్లను రాబడుతుందని నమ్మకంతో ఉన్నారు. అయితే టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రెండో వారం ఏ సినిమా నడిచే విషయంలో క్లారిటీ ఇవ్వలేమంటున్నారు. దీనికి కారణం వకీల్ సాబ్ తరువాత వరుసగా నాగచైతన్య లవ్ స్టోరీ ఏప్రిల్ 16 న అలాగే నాని నటించిన టక్ జగదీశ్ 23 న విడుదలవుతున్నాయి.  కానీ ఈ రెండు సినిమాలపై కరోనా ప్రభావం భారీగా ఉండనుందని వారి అభిప్రాయం.
దీనిపై ఇప్పటికే నాగచైతన్య మరియు నాని లు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు హిట్ అయితే కానీ...సమ్మర్ లో విడుదలయ్యే మరి కొన్ని సినిమాల భవిష్యత్తు చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే 50 శాతం సీటింగ్ ను పరిమితం చేయడానికి ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ సమ్మర్ లో విడుదల కానున్న సినిమాలన్నీ వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కరోనా సినిమా ఇండస్ట్రీని కరుణిస్తుందా..లేదా మరోసారి జాలి లేకుండా తన విలయాన్ని సృష్టిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: