కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసుల తో పాటు సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇక మహమ్మారి కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోతూ దుఖంలో మునిగిపోతున్నారు. ఒక్కో కుంటుంబంలో ఇద్దరు ముగ్గురు సైతం మహమ్మారికి బలౌతున్నారు. ఈ క్రమంలో తల్లి దండ్రలను సైతం కోల్పోతూ రోడ్డున పడుతున్న పిల్లలు కూడా ఉన్నారు. కాగా తల్లిదండ్రులు లేక అనాథలవుతున్న పిల్లల ఆలనా పాలనా చూసేందుకు ఇప్పుడు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా ముందుకు వచ్చారు.
కరోనా కారణంగా అనాథలైన పిల్లల ఆలనా పాలనా నేను చూసుకుంటాను నాకు వారి వివరాలు తెలియజేయండి.
వారిని నేనే చదివిస్తాను. అంటూ సందీప్ కిషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. పిల్లల వివరాలను (sundeepkishancovidhelp@gmail.com) ఈ మెయిల్ అడ్రస్ కు పంపించాలని సందీప్ కిషన్ కోరారు. తాను తన టీమ్ తో కలిసి సాధ్యమైనంత మంది పిల్లలను చూసుకుంటానని తెలిపారు. కొన్ని సంవత్సరాల వరకూ అన్ని ఖర్చులూ తానే భరిస్తానని సందీప్ కిషన్ తెలిపారు. ఇవి కఠినమైన పరిస్థితులని ఈ సమయంలో మనుషులు ఒకరికొకరు అండగా నిలబడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని జాగ్రత్తగా ఉండాలని కోరారు. అంతే కాకుండా పొరుగువారికి అవసరమైనంతవరకూ సహాయం చేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మిగతా హీరోలు మాత్రం ట్వీట్ల సాయంతో సరిపెట్టుకుంటున్నారు. ప్లాస్మా దానం చేయాలని మెసేజ్ ఇవ్వడంతో పాటు సాయం కోరుతున్న వారి ట్వీట్లను షేర్ చేస్తూ అక్కడితోనే ఆగిపోతున్నారు. కానీ సందీప్ కిషన్ మాత్రం నేరుగా సాయం చేయడానికి రంగంలోకి దిగారు. దాంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.