కంటతడిపెట్టిన సోనూసూద్..ఎందుకంటే..?

Suma Kallamadi
సినిమాలో విలన్‌గా కనిపించే సోనూసూద్‌ రియల్‌లైఫ్‌లో మాత్రం అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ల ఊర్లకు చేర్చాడు. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఎవరు సాయం అడిగిన లేదనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు సోనూసూద్‌. ప్రాంతం, భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాడు. ఇటీవలే కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా నాగ్పుర్ నుంచి హైదరాబాద్ తరలించడంలో సాయం చేశారు నటుడు సోనూసూద్. అయితే ఈ యువతి కొవిడ్తో పోరాడుతూ చనిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ సోనూసూద్ భావోద్వేగం చెందారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడింది. వైరస్‌ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85 శాతం వరకూ దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్‌ పెట్టారు. "కొవిడ్‌తో తీవ్ర పోరాటం చేస్తోన్న భారతి అనే యువతిని ఇటీవల నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. నెల రోజులపాటు ఆసుపత్రిలో ఆమె జీవితంతో పోరాటం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. నేను ఆమెను బతికిస్తాననుకున్నా. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది."అంటూ సోనూసూద్ భావోద్వేగానికి గురయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: