మెగాస్టార్, సూపర్ స్టార్ కి వీరాభిమాని అనే విషయం మీకు తెలుసా ..... ??
ఒకానొక సమయంలో అన్న ఎన్టీఆర్ కి ధీటైన పోటీనిచ్చిన సూపర్ స్టార్ కృష్ణ నుండి సినిమా వస్తుంది అంటే యువత, మాస్ ప్రేక్షకుల్లో నెలకొన్న జోష్ వేరేస్థాయిలో ఉండేది. ఇక థియేటర్స్ దగ్గర వారి సందడి అయితే మారుమ్రోగిపోయేది. ఆ విధంగా కొన్నేళ్ల పాటు తిరుగులేని హీరోగా దూసుకెళ్లిన కృష్ణ ఎంత అందంగా ఉంటారో ఆయన మనసు అంతే అందంగా ఉంటుంది. దర్శకనిర్మాతల పాలిటి కల్పవృక్షం అయిన కృష్ణ కు అప్పట్లో సినిమా నటుల్లో సైతం పలువురు ఫ్యాన్స్ ఉండడం విశేషం. ఇక తరువాత తరంలో హీరోగా వచ్చి నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ గా గొప్ప క్రేజ్ దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కు పెద్ద అభిమాని. అప్పట్లో పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ ప్రెసిడెంట్ గా చిరంజీవి వ్యవహరించడం విశేషం.
అప్పుడెప్పుడో కృష్ణ తో కలిసి చిరంజీవి తోడుదొంగలు సినిమా చేసిన సమయంలోని పాంప్లెట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అలానే తన అభిమాన హీరో ఎప్పటికీ సుఖంగా ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ నేడు మెగాస్టార్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కృష్ణ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఇక తనకు కృష్ణ గారంటే ఎంతో ఇష్టం, అభిమానం అంటూ మెగాస్టార్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా నాటి సూపర్ స్టార్ కి నేటి మెగాస్టార్ అభిమాని కావడం ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్నిచ్చే విషయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు .... !!