బాహుబలి సినిమా తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారత దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో తెలుగులో రూపొందుతున్న చాలా సినిమాలు పలు భాషలలో విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం రూపొందుతున్న సినిమాలలో చాలా వరకు పాన్ ఇండియన్ మూవీసే కావడం విశేషం. బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రెయిట్ హిందీ సినిమాలు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల షూటింగ్స్ ఎక్కువగా ముంబయిలో జరుపుతుంటారు. దీంతో ప్రభాస్ హైదరాబాద్ నుంచి తరచూ ముంబయికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎక్కువ సమయం ముంబయిలోనే గడపాల్సి వస్తుంది కాబట్టి అక్కడే ఒక ఇల్లు కొనుగోలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా కోసం అన్వేషిస్తున్నారట.
గతేడాది రామ్ చరణ్, ఉపాసన కలిసి ముంబయిలోని ఓ ప్రధాన ప్రాంతంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కూడా ఇండియా స్టార్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆయన హిందీ ప్రాజెక్టులను చేజిక్కించుకోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ఆయన మూవీ షూటింగ్స్ సమయంలో తన అపార్ట్‌మెంట్ లోనే హాయిగా సేద తీరవచ్చు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నేషనల్ లెవెల్ లో ఫేమ్ సంపాదించారు. ప్రస్తుతం లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆయన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే తో కలిసి రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు కావడం విశేషం.
అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ ముంబయి లోనే జరిగింది. దీంతో విజయ్ ఎక్కువ కాలం ముంబయిలోనే ఉండాల్సి వచ్చింది. అయితే విజయ్ బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు కాబట్టి ముంబయిలో ఒక సొంత ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన కూడా మంచి ఇంటి కోసం అన్వేషిస్తున్నారట. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కూడా ముంబయిలో ఒక మంచి బంగ్లా కొనాలని ప్లాన్ చేస్తున్నారట. హిందీ సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు కూడా ముంబయిలో ఒక మంచి ఇంటి కోసం అన్వేషిస్తున్నారట.