పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించనున్న నటీనటుల గురించి అధికారిక ప్రకటనలు విడుదలయ్యాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారని.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారని.. రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారని.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించనున్నారని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక మిగతా పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ చిత్రంలో ఫలానా నటీనటులు నటించనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా ఆదిపురుష్ చిత్రంలో నటించనున్నారని పుకార్లు షికారు చేశాయి. దీంతో సాక్షాత్తు అతడే ఈ రూమర్స్ పై స్పందించారు. సామాజిక మాధ్యమాలలో తన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఆదిపురుష్ మూవీ యూనిట్ తనను సంప్రదించలేదని.. ఒకవేళ చిత్ర బృందం తనని సంప్రదించినట్లయితే ఈ విషయాన్ని తాను ఎప్పుడో వెల్లడించే వాడినని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఆయన క్లారిటీ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రచారం మొదలైంది. సిద్ధార్థ్ శుక్లా ఆదిపురుష్ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన అన్ని ప్రచారాల్లో సిద్ధార్థ్ శుక్లా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో ఆయన నటిస్తున్నారా లేదా అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదలైతే.. క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఐదు వందల కోట్ల బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందుతున్న ఆదిపురుష్ సినిమాపై కోట్లాది మంది ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం వారి అంచనాలను చేరుకుంటుందో లేదో చూడాలి. ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.