పీకే.. "ఏకే".. రీమేక్.. అప్పటికే..!
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే దానికి కారణం కరోనా కాకపోయినా.. మరో సినిమా కావడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం హరి హర వీరమల్లు.ఈ ప్రాజెక్ట్ టీజర్ తో అంచనాలను అమాంతం పెంచేసింది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.
సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న సినిమా కావడంతో అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగడం లేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాదనే వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ నిర్మాత ఏ ఎమ్ రత్నం స్టేట్ మెంట్ ఇచ్చారు. సినిమా అనుకున్న సమయానికి వచ్చి తీరుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ అని తెలుస్తోంది.