డైరెక్టర్ ప్రశాంత్ వర్మలో మరో టాలెంట్.. షాక్ అవుతున్న ప్రేక్షకులు..?
ఆయన తాజాగా జరిగిన హైదరాబాద్ లోని ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో రెండు రకాల కేటగిరీలలో గెలిచి కప్ లు సాధించారు. సింగిల్స్ లో విజేతగా నిలవడంతో పాటు డబుల్స్ లో కూడా ఆయన తన సత్తా చాటి ఛాంపియన్షిప్ కప్ సొంతం చేసుకున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఆయన ఛాంపియన్షిప్ కప్ అందుకుంటున్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఒక చిత్రంలో ఆయన బ్యాట్మెంటన్ జెర్సీ ధరించి ఛాంపియన్షిప్ కప్ పట్టుకుని నవ్వుతూ కనిపించారు. మరో పిక్చర్ లో ఆయన తన క్రీడా పార్ట్నర్ తో కలిసి కనిపించారు. డబుల్ కేటగిరిలో కూడా విజయం సాధించి మరొక ఛాంపియన్షిప్ కప్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే 'మీకు మాత్రమే చెప్తా’ ప్రోగ్రామ్ లో తాజాగా పాల్గొన్న ప్రశాంత్‌వర్మ అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. చదువుల్లో రాష్ట్ర స్థాయిలో రాణించిన ప్రశాంత్ వర్మ క్రీడల్లో జిల్లా స్థాయిలో రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ విషయం గురించి 'మీకు మాత్రమే చెప్తా’ ప్రోగ్రామ్ లో ఒక ప్రశ్న సంధించారు. దానికి ఆయన సమాధానం చెబుతూ.. 'మా అమ్మ గణిత ఉపాధ్యాయురాలు. నేను క్లాస్ లో ఎప్పుడూ టాపర్ గా ఉండాలని మా అమ్మ కోరుకునే వారు. వేసవి సెలవల్లో నా తదుపరి తరగతికి సంబంధించిన పాఠాలు ముందుగానే చెప్పేవారు. దీనివల్ల నాకు పాఠాలు బాగా అర్థమయ్యేవి. ఆ విధంగా నేను చదువుల్లో రాణించగలిగాను. ఇక మా నాన్నకు క్రీడలు అంటే మహా ఇష్టం. చీకటి పడే వరకు క్రికెట్ ఆడాలని కండిషన్ పెట్టేవారు. ఆ విధంగా చిన్నప్పట్నుంచే నేను గంటల తరబడి క్రికెట్ ఆడే వాడిని. కానీ క్రికెట్లో ఒక్కడు తప్పు చేసినా మ్యాచ్ ఓడిపోయే వాళ్ళం. దీంతో నాకు ఆ ఆట నచ్చలేదు. బ్యాట్మెంటన్ క్రీడలో విజయం ఒక వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నేను బ్యాట్మెంటన్ ఆడటం ప్రారంభించాను,' అని చెప్పుకొచ్చారు.