భారతీయ సినిమా పరిశ్రమలోని అనేకమంది గొప్ప నటుల్లో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఒకరు. తన కెరీర్ లో మోలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా చాలా చిత్రాలు చేసిన మమ్ముట్టి మొత్తంగా 400 వరకు సినిమాలు చేసారు. ఇక తొలిసారిగా మలయాళంలో అనుభవంగల్ పలిచాకల్ సినిమా ద్వారా సినిమా తెరకు పరిచయమయ్యారు. కేఎస్ సేతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిన్న పాత్ర చేసారు మమ్ముట్టి. 1971లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కాలచక్రం, విక్కనుండు స్వప్నన్గల్, ఇలా వరుసగా అవకాశాలతో కొనసాగిన మమ్ముట్టి, తన కెరీర్ లో అక్కడి నుండి అనేక విజయవంతమైన చేసి నటుడిగా ప్రేక్షకుల మనస్సులో మెగాస్టార్ గా మంచి పేరు దక్కించుకున్నారు.
ఇక అభిమానులు ముద్దుగా మమ్ముక్క అని పిలుచుకునే మమ్ముట్టి పూర్తి పేరు మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. ఇక తెలుగులోనూ మమ్ముట్టి పలు చిత్రాల్లో నటించారు. ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాధ్ తీసిన గొప్ప చిత్రం స్వాతికిరణం లో ముఖ్య పాత్ర చేసిన మమ్ముట్టి ఆ సినిమాతో తెలుగు ఆడియన్స్ నుండి కూడా బాగా పేరు దక్కించుకున్నారు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కిన యాత్ర సినిమాలో వైఎస్ గా నటించి ప్రేక్షకాభిమానుల మనసు దోచారు మమ్ముట్టి. అలానే పలు డబ్బింగ్ మూవీస్ ద్వారా కూడా ఇక్కడి ఆడియన్స్ ని అలరించిన మమ్ముట్టి కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి చేసిన దళపతి మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు.
ఆ విధంగా నటుడిగా అందరి నుండి గొప్ప ప్రశంసలు అందుకున్న మమ్ముట్టి నేటితో సక్సెస్ఫుల్ గా 50 ఏళ్ళ సినిమా కెరీర్ ని (గోల్డెన్ జూబిలీ) పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రేక్షకాభిమానులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం మలయాళ యాక్టర్ మోహన్ లాల్, ప్రత్యేకంగా మమ్ముట్టి కి శుభాభినందనలు తెలియచేస్తూ ఆయనతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసారు. ప్రస్తుతం అది సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది. తరచు పలు సామజిక సేవా కార్యక్రమాలు చేసే అలవాటు గల మమ్ముట్టి ఈ ఏడాది సెప్టెంబర్ 7 తన జన్మదినం సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపుకోవడం లేదని, ఆ రోజున పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు, అలానే అభిమానులు కూడా అటువంటి మంచి పనులు చేసి ప్రజలకు వీలైనంతలో సాయపడాలని ఆయన విజ్ఞప్తి చేసారు .... !!