పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ మంచు మనోజ్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఝుమ్మందినాదం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు టాలీవుడ్ జనాల నుంచి మంచి స్పందన లభించడంతో తెలుగులో వరుస ఆఫర్లతో చేజిక్కించుకుంది. అందులో భాగంగానే దరువు, మిస్టర్ ఫర్పెక్ట్ ,షాడో వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. 'చస్మే బద్దూర్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అనేక ఆఫర్లను దక్కించుకుంది. ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు చేయడానికి ఇష్ట పడిన తాప్సీ అందులో భాగంగానే పింక్, తపడ్, హసన్ దిల్రుబా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. మళ్లీ తాప్సీ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'అనబెల్ సేతుపతి' సినిమాతో దక్షిణాది లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా ఈ మధ్యనే విడుదల అయ్యి జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాప్సి సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఛత్తీస్గఢ్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాప్సీ తప్పు పట్టింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇటీవలే ఒక సంచలన తీర్పును వెలువరించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు ఇష్టం ఉన్నా లేకపోయినా భర్తతో లైంగిక చర్య చేయవచ్చు అంటూ కోర్టు తీర్పును వెలువరించింది. ఇది అత్యాచారం కిందికి రాదని కోర్టు స్పష్టం కూడా చేసింది. అయితే ఒక స్త్రీకి ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం చేయడం కచ్చితంగా అత్యాచారమే అని తాప్సీ పరోక్షంగా పేర్కొంది. మనం వినాల్సిన వాటిలో ఇది ఒక్కటే మిగిలి ఉందని పేర్కొంది. తాప్సీ తో పాటు సోనా మెహపాత్రా కూడా ఈ తీర్పును వ్యతిరేకించారు.