ప్రముఖ హాస్యనటుడు రమణారెడ్డి అనగానే ముందుగా గుర్తొచ్చేది సూర్యకాంతం.. సూర్యకాంతమ్మ కు అన్న పాత్రలో, తమ్ముడు పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. సినిమా ఇండస్ట్రీ మొదలైన తొలినాళ్ళలో తన అద్భుతమైన నటనతో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమణారెడ్డి, ఎన్టీఆర్ ,ఏఎన్నార్ కాలంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించారు.. ఆ కాలంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలామంది నటులు రంగస్థలం మీద నటించి , ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారే.. కానీ రమణ రెడ్డి మాత్రం వీరందరికీ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి..
ఇక ఈయన పూర్తి పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. 1921 వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన జన్మించిన ఈయన చాలా పొడవుగా , సన్నగా ఉండడంతో ఆయన మీద ఎన్నో జోకులు వేసుకునేవారు. ఇకపోతే ఈయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు నెల్లూరులో ఒక శానిటరీ ఇన్ స్పెక్టర్ గా పని చేసే వారు. ఇక నటన మీద ఆసక్తితో ఉద్యోగం వదిలేసి ,మద్రాసు వెళ్లారు.. రమణారెడ్డి గురించి మనకు తెలియని ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ,ఆయన ఒక గొప్ప మెజీషియన్. సినిమాలు ఉన్న సమయమైనా లేని సమయమైనా కొద్దిగా చిన్న పాటి ఖాళీ సమయం దొరికితే చాలు, మ్యాజిక్ నేర్చుకోవాలని తెగ ఆరాటపడేవారు.
ఎట్టకేలకు ఒక గొప్ప మెజీషియన్ గా మారిన ఈయన ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అంతే కాదు కొంత మంది శిష్యులను కూడా తయారు చేసిన ఘనత ఆయనది. సేవా సంఘాల సహాయనిధికి మీ మ్యాజిక్ తో సహాయం చేయాలని అడిగితే, ఆ సంస్థ ఎలాంటిది అని పూర్తిగా పరిశీలించిన తర్వాత సరే అనిపిస్తే ఒక రూపాయి కూడా తీసుకోకుండా పని చేసేవారు. ఇక లవకుశ వంటి గొప్ప పౌరాణిక కథా చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత శంకర్ రెడ్డి ప్రోత్సాహంతోనే రమణారెడ్డి సినీ ఇండస్ట్రీలోకి మాయపిల్ల అనే సినిమా ద్వారా అడుగుపెట్టాడు. ఆయన మన మధ్య లేకపోయినా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుపొందిన ఉత్తమ హాస్యనటుడు అని చెప్పవచ్చు.