కమెడియన్ కాస్త దర్శకుడిగా, నిర్మాతగా మారిన వేళ..!
శ్రీనివాస్ రెడ్డి 1973 వ సంవత్సరం ఫిబ్రవరి 23 వ తేదీన రామిరెడ్డి - వెంకట రామమ్మ అనే దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జన్మించారు. శ్రీనివాస్ రెడ్డి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.. ఇకపోతే శ్రీనివాస్ రెడ్డి కి సినిమాల అన్నా, క్రికెట్ అన్నా చాలా ఇష్టమట.. ఎప్పుడైనా థియేటర్ కు సినిమా చూడడానికి వెళ్తే వచ్చిన తర్వాత సినిమా కథ అంతా ఇట్టే తన స్నేహితులతో చెప్పేవారట. శ్రీనివాస్ రెడ్డి తన ప్రాథమిక విద్య ను నేషనల్ హై స్కూల్ లో 5వ తరగతి వరకు చదువుకున్నారు. సూర్యాపేట లో ఉన్న శిరీష విద్యానికేతన్ హై స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. అప్పట్లోనే కమెడియన్ గా స్కూల్ యానివర్సరీ ప్రోగ్రాం లో చేస్తూనే ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ లు వేయడం, కృష్ణ లాగా డైలాగులు చెప్పడం లాంటివి చేస్తూ ఉండేవాడు. ఆయన డిగ్రీ చదువు కునేటప్పుడు మైన్స్ లో మ్యాన్ ఆఫ్ ది యూనివర్సిటీ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను ,నటనలో కాలేజీ సమయంలోనే పొందాడు శ్రీనివాస్ రెడ్డి.
తన శ్రేయోభిలాషులు అందరూ సినిమాలలో చేరమని చెబితే అలా మొదటిసారి శ్రీనివాస్ రెడ్డి 2001వ సంవత్సరంలో నటుడిగా ఇష్టం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆతర్వాత ఇడియట్, వెంకీ, డార్లింగ్ వంటి సినిమాలలో ముఖ్యమైన పాత్రలు పోషించి అలరించారు.. 2014వ సంవత్సరంలో గీతాంజలి సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీనివాస్ రెడ్డి ,2019 లో వచ్చిన భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమా ద్వారా దర్శకుడిగా చలామణి అవుతున్నారు.