గుండు హనుమంతరావు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..?
పదేళ్ల వయసులోనే నాటకరంగం వైపు ఆకర్షితులయ్యారు. ఒక వైపు చదువుకుంటూ.. మరో వైపు నాటకాలు కూడా వేసేవారు. వీరి పెద్దనాన్న కృష్ణబ్రహ్మ కూడా సింగర్. ఇండస్ట్రీలో హనుమంతరావు నటించిన సినిమాలు.. కొబ్బరిబొండం, బాబాయ్ హోటల్, యమలీల సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలో హనుమంతరావు బాగా కనిపిస్తారు. అయితే తెర ముందు అందరినీ నవ్వించే హనుమంతరావు.. తెర వెనుక ఎన్నో కష్టాలు పడ్డారు. 2010లో అతని భార్య ఝాన్సీరాణి ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో హనుమంతరావు బాగా కుంగిపోయారు. హనుమంతరావుకు ఒక కుమారుడు (ఆదిత్య సాయి), ఒక కూతురు (హరిప్రియ).
2008లో కూతురు హరిప్రియకు మెదడువాపు జ్వరం రావడంతో ఆమె మరణించింది. కొడుకు ఆదిత్యసాయికి బాగా చదివించారు. ఎంఎస్ కోసం అమెరికాకు పంపించాడు. కానీ విధి వక్రీంచింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాలనుకునే సమయంలో హనుమంతరావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆదిత్య ఉద్యోగాన్ని వదిలేసి తండ్రి దగ్గరికి వచ్చేశాడు. గుండెపోటుతో బాధపడే హనుమంతరావుకు కిడ్నీ సమస్య కూడా ఎదురైంది. కిడ్నీ సమస్య పరిష్కారం అయితే తప్ప గుండెకు శస్త్ర చికిత్స చేయమని వైద్యులు చెప్పేశారు. దీంతో ఆదిత్య తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచారు. వైద్యం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 2018 ఫిబ్రవరి 19వ తేదీన హనుమంతరావు స్వర్గస్తులయ్యారు.