బాలుకు ప్రేమతో : నాన్నను మించి పోయాడు చరణ్ !

RATNA KISHORE
నివాళి అన్న పదానికి విస్తృతార్థం ఉంది. అందుకు తగ్గ రీతిలో బాలుకు నివాళి చెప్పడం ఓ గొప్ప ప్రయత్నానికి సంకేతిక. గంధర్వ గానం ఆయనది అని చెప్పినా, స్వరామృత ధార ఆయనిది అని చెప్పినా, నివాళిలో ఉండే నిజాయితీనే అదంతా! గొప్ప సంగీతానికి , గొప్ప సాహిత్యానికి మనం రోజులు వెతుక్కుంటున్న రోజుల్లో ఆనాటి తోవల్లో కనిపించే, వినిపించే పాటల్లో బాలు ఉంటారు. ఆయన మన ఇంటి బిడ్డ అని కూడా అనిపించేలా మన తెలుగు వాకిళ్లలో ఉండిపోయారు. రెండు రాష్ట్రాలకూ చెందిన ప్రతి ఒక్కరి హృదయంలో ఇంత చోటు ఉంచుకున్న ఆయన తెలుగు వారి ఆస్తి. ఆ స్వరానికి నిష్క్రమణ లేదు. అందుకే ఆయనపై ప్రేమతో ఏ పని చేసినా ఆ కుటుంబం ఎంతో కృతజ్ఞతతో ఉంటుంది ఇవాళ. నాన్నగారికి భారత రత్న ఇచ్చినా ఇవ్వకున్నా అనవసర రాద్ధాంతం అయితే వద్దండి అని చెప్పే చరణ్, అన్నయ్యను స్మరించుకునే చెల్లి శైలూ వీరే కదా మన ఇంటి చుట్టాలు.ఆత్మీయ బంధాలు. కొన్ని పాటలు ఇంకా నేను బాగా నేర్చుకోవాలి అని చెప్పే వేళ చరణ్ బాగా నచ్చుతారు. ఇది నాన్న నేర్పారు ..నేను మీకు చెబుతున్నాను అని మాత్రమే చెప్పే వేళ ఆయన ఇంకాస్త ఎక్కువే మన దగ్గర నుంచి అభిమానం పొందుతారు.



మొన్న ఈటీవీ సంస్థ ఎంతో వినమ్ర పూర్వక నివాళి ఒకటి మంచి గాయకుడు ఎస్పీ బాలుకు ఇచ్చింది. ఈ పని టాలీవుడ్ పెద్దలు చేయాలి. కానీ ఏడాది అయినా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున పూర్తి స్థాయి నివాళి కార్యక్రమం ఒకటి లేదు. సరే! ఆ గోల ఎప్పుడూ ఉండేదే కానీ రామోజీ గారు మాత్రం తన దైన స్థాయిలో శైలిలో మంచి కార్యక్రమం నిర్వహించారు. అజయ్ శాంతి, ఓలేటి శ్రీనివాస భాను లాంటి సీనియర్ రైటర్లు కార్యక్రమానికి స్క్రిప్టు సహకారం ఇచ్చి, మంచి వన్నె తెచ్చారు. ఈ కార్యక్రమంలో చరణ్ భావోద్వేగాలను అస్సలు ఆపుకోలేకపోయారు. ఎన్నోసార్లు నాన్నను తల్చుకుని కన్నీటిపర్యంతం అయి నాన్నకు నివాళి ఇచ్చి, నాన్నా! ఇది నీవిచ్చిన జీవితం అంటూ  అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో చరణ్ ఆలపించిన ఎదుటా నీవే (అభినందన సినిమాలో గీతం, ఆత్రేయ సాహిత్యం) ఎంత గొప్పగా పాడారో..! నాన్నను స్మరిస్తూ నాన్నను మించి పాడారు. స్వరాభిషేకంలో ఇదే పాట బాలు ఆలపించారు. ఆయన కన్నా ఈ ఉద్వేగాల జడిలో చరణ్ ఈ పాటను ఆలపించిన పద్ధతి ఎంతో బాగుంది. ఈ కన్నీటి వానలకు కారణ నీవే నాన్న అన్న ధ్వనిని , అర్థాన్నీ ఇస్తూ పాడారీ పాట.. నాన్నకు నివాళి. అవును ఆ గాత్రం శివ క్షేత్రమే! గొప్ప నివాళి …థాంక్యూ ఈటీవీ…



మరింత సమాచారం తెలుసుకోండి:

spb

సంబంధిత వార్తలు: