'మా'పోరు: మోహన్ బాబును కలిసిన రాజశేఖర్.. ఎందుకంటే..?

Chakravarthi Kalyan
మా ఎన్నికల నేపథ్యంలో ఎన్నో వివాదాలు తెరపైకి వస్తున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ విమర్శలు జోరు పెరుగుతోంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున జీవిత జనరల్ సెక్రటరీ పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జోరు పెంచిన మంచు విష్ణు ప్యానల్ ప్రకాశ్ రాజ్, జీవితలపై అనేక విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం విష్ణు మాట్లాడుతూ.. అసలు రాజశేఖర్ మా ఇంటికి వచ్చి మోహన్ బాబుతో ఏం మాట్లాడారు.. అంటూ ఏదో విషయం చెప్పబోయారు. ఆ సమయంలో నరేశ్ మంచు విష్ణును కంట్రోల్ చేశారు. దీంతో ఏదో విషయం ఉందన్న చర్చ మొదలైంది.

ఇదే అంశం మరికొందరు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఈ అంశంపై జీవిత క్లారిటీ ఇచ్చారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. ఆమె ఏమంటున్నారంటే.. నా భర్త రాజశేఖర్‌ మోహన్‌బాబుని కలిసిన మాట వాస్తవమే.. గత కొన్నిరోజుల నుంచి మేము నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది..  ఓరోజు రాజశేఖర్‌ ఓ అరగంట షూటింగ్‌కి ఆలస్యంగా వస్తానని నాకు ఫోన్‌ చేసి చెప్పారు.. నేను ఎందుకు అని నేను అడిగాను.. వచ్చే దారిలోనే మోహన్‌బాబు ఇల్లు ఉంది కదా.. ఓసారి ఆయన్ని కలిసి వస్తాను అని రాజశేఖర్ చెప్పారు.

ఇంతకీ అసలు రాజశేఖర్‌ మోహన్‌బాబుని కలిసింది ఎందుకు అంటే.. 'మా' ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి - మోహన్‌బాబు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బయట ప్రచారం జరుగుతోంది. మాఎన్నికల సమయంలో తలెత్తుతున్న వివాదాలు సద్దుమణిగేలా చూడాలని రాజశేఖర్ మోహన్‌బాబుతో చెప్పారు. ఇంతకుమించి  రాజశేఖర్ మోహన్ బాబుతో ఏమీ మాట్లాడలేదు అంటూ జీవిత క్లారిటీ ఇచ్చారు.

అదే సమయంలో ఎవరికీ ఓటు వేయకండి  అని తాను అన్న మాటలపైనా వివరణ ఇచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై నేను చేసిన మొత్తం వ్యాఖ్యలను వదిలేసి కేవలం 'ఓటు వేయకండి' అని చెప్పిన ఒక్కపదాన్నే పట్టుకుని గొడవ చేస్తున్నారని జీవిత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: