మంచు విష్ణుకి అదే ప్లస్.. అదే మైనస్

Deekshitha Reddy
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ పెంచుతున్నాయి. పోటీలో ఉన్న రెండు ప్యానళ్లలో, బలమైన అభ్యర్థులు ఉండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఒకరకంగా చెప్పాలంటే సాధారణ ఎన్నికలను తలదన్నేలా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్యానళ్లకు చెందిన అభ్యర్థులు, మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు.. ఇద్దరూ ఇండస్ట్రీలో హేమాహేమీలే కావడంతో ఇప్పుడు ఈ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి.

ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇవ్వగా.. మంచు విష్ణుకు మాత్రం తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతోపాటు ఇతర సినీ పెద్దలు కూడా మద్దతుగా ఉన్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబు విష్ణు గెలుపు కోసం చక్రం తిప్పుతున్నారు. విష్ణు ఇప్పటికే సీనియర్లు అందరినీ కలిసి.. మద్దతు ఇవ్వాలని కోరాడు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, నందమూరి బాలకృష్ణను స్వయంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి తోడు సినీ నటుల కోసం సొంత ఖర్చుతో భవనం నిర్మిస్తానని కూడా ప్రకటించాడు. అదే విధంగా ఇళ్ళు లేని నటీనటులకు ఇళ్ళు కట్టించి ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ కూడా ఇచ్చారు.

దీనికి తోడు మంచు విష్ణుకు ప్రధానంగా లోకల్ అనే ఆయుధం తోడైంది. ప్రకాష్ రాజ్ ఎలాగూ నాన్ లోకల్.. సినిమాలు ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ లో ఉంటాడు. లేదంటే చెన్నై వెళ్ళిపోతాడనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి విష్ణు ప్రచారం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు విష్ణుకు ప్లస్ పాయింట్ అయింది. విష్ణు ఎలాగూ హైదరాబాద్ లోనే ఉంటాడు కనుక.. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని ప్రచారం చేసుకుంటున్నాడు. దీనికి తోడు మంచు ఫ్యామిలీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను ఎలాగూ బంధుత్వం ఉండనే ఉంది. ఇలా రాజకీయంగానూ మంచు విష్ణుకు బలమైన మద్దతు కనిపిస్తోంది.

ఇక మైనస్ ల గురించి చెప్పుకోవాలంటే.. విష్ణు మీడియా ముందుకొచ్చి బాగా వీక్ అయినట్టు కనిపిస్తోంది. టీవీ-9 ఇంటర్యూపై ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి. ఆయన ఫ్రస్టేషన్ కూడా పీక్స్ లో కనిపిస్తోంది. ఇవన్నీ ఓటు వేసే నటీనటులు గుర్తు పెట్టుకుంటారా లేదా అనేది చెప్పలేం కానీ.. తనకు తానే ఏదో మాట్లాడాలని, ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేయాలని ప్రయత్నించి విష్ణు కాస్త ఇబ్బంది పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: