చివరి నిమిషంలో ట్విస్ట్.. మంచు విష్ణు కొత్త ప్లాన్ ఇది..
నిన్నటివరకూ ప్రకాష్ రాజ్ తో పాటూ.. మంచు విష్ణు కూడా నేరుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరికున్న పరిచయాల మేరకు వారు.. మద్దతు కూడా కూడగట్టుకున్నారు. సీనియర్ నటీనటులచేత ఇంటర్వ్యూలు కూడా ఇప్పించారు. ఈ ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ కాస్త లైట్ తీసుకున్నా.. మంచు విష్ణు మాత్రం గట్టిగానే పోరాడుతున్నారు. ఎలాగైనా మా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని.. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నట్టున్నారు. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రత్యర్థి ప్యానల్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ నోరు తెరవకుండా చేసిన విష్ణు.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చిన వారిపైనా.. చివరి నిమిషంలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
తాజాగా మంచు విష్ణు.. మెగా బ్రదర్ నాగబాబును టార్గెట్ చేశారు. నిన్నటి వరకూ దూకుడుగా మాట్లాడిన విష్ణు.. ఇప్పుడు కాస్తంత హుందాగా వ్యవహరించాడు. ఎన్నికల సమయంలో ఎలా మాట్లాడాలో, అచ్చంగా అలాగే మాట్లాడాడు. తనపై వ్యక్తిగతంగా నాగబాబు విమర్శలు చేస్తున్నా.. తానేమీ అనలేనని అన్నారు. ఎందుకంటే నాగబాబును విమర్శిస్తే.. మెగాస్టార్ చిరంజీవిని అవమానించినట్టేనని.. అందుకే తాను ఏమీ మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. దీంతో మంచు విష్ణు కాస్త, మంచి విష్ణుగా మారిపోయాడు. ఆఖరి నిమిషంలో వేసిన ఈ ఎత్తును ఎవరూ ఊహించలేకపోయారు. మెగా ఫ్యామిలీ సపోర్టర్స్ కూడా తనకే ఓటు వేసేలా టైం చూసి దెబ్బ కొట్టాడు. ఏది ఏమైనా మంచువిష్ణుకు అప్పుడే రాజకీయం వంటబట్టినట్టే కనిపిస్తోంది.