కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. చిన్న వయసులోనే గుండెపోటుతో అకాలమరణం చెందడం ఆయాన అభిమానుల్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన చనిపోయి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్త తెలిసి ఇప్పటికే 12 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు.వరుసగా అభిమానులు సూసైడ్ కి పాల్పడటంతో పునీత్ రాజ్ కుమార్ భార్య మొదటిసారి ఈ విషయమై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ మరణం తమ కుటుంబానికి తీరని లోటు.
ఇలాంటి మీ కుటుంబాలకు కూడా రావద్దని ఆమె కోరుకున్నారు. ఇక ఆమె స్పందిస్తూ.." అప్పు లేడని విషయాన్ని మేము కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలకు ఎప్పటికి రుణపడి ఉంటాం.పునీత్ మన మధ్య లేకపోయినా, మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాలను ఒంటరి చెయ్యొద్దు" అంటూ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోపక్క పునీత్ రాజ్ కుమార్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర లు సైతం ఇదే విషయంలో అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో అభిమానులు ఎవరు కూడా అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరుకున్నారు. అంతే కాకుండా ఆయన అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలను పదేపదే ప్రసారం చేయవద్దని మీడియాకు సైతం రిక్వెస్ట్ చేశారు. ఇక మరోవైపు పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద ఇప్పటికే ఒక్కొక్కరుగా తమిళ హీరోలు చేరుకుని ఆయన సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే హీరో విశాల్, సూర్య, రామ్ చరణ్ తదితరులు పునీత్ సమాధి వద్దకు చేరుకొని ఆయనకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక అభిమానులు కూడా పునీత్ సమాధిని చూడ్డానికి తరలి వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది...!!