వరుణ్ తేజ్ హీరో గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా గని, ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర మరియు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అని తెలియడం తోనే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను మాత్రం చిత్ర బృందం పెద్దగా విడుదల చేయలేదు. అయితే తాజాగా గని చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ను అందించాడు. ఒక నిమిషం తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ టీజర్ లో రామ్ చరణ్ వాయిస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
రామ్ చరణ్ ఈ సినిమా టీజర్ లో తన వాయిస్ తో సినిమా కథ, కథనాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాడు. ప్రతి ఒక్కరి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి... కోరికలు ఉంటాయి... కోపాలు ఉంటాయి... కలబడితే గొడవలు ఉంటాయి... అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఛాంపియన్ అవ్వాలనే ఆశ ఉంటుంది... కానీ విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి... వై యూ.?' అని చరణ్ చెప్పే డైలాగ్ తో గని సినిమా టీజర్ మొత్తాన్ని చూపించారు. ఈ సినిమా టీజర్ ను గమనిస్తే ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. మరి ముఖ్యంగా బాక్సింగ్ సన్నివేశాల కోసం వరుణ్ తేజ్ తన బాడీ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేసినట్లు కనిపిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ మూవీ ని రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 24 డిసెంబర్ 2021 న విడుదల కానుంది.