టాలీవుడ్లో రైటర్ గా అడుగు పెట్టి కొన్ని చిత్రాలకు కథలను అందించిన కొరటాల శివ.. ఆతర్వాత 2013వ సంవత్సరంలో 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని దర్శకుడిగా కూడా కొరటాల శివ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో 'ఆచార్య' అనే సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తో మరో ప్రాజెక్ట్ ని ప్రకటించాడు కొరటాల శివ. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కు సంబంధించిన స్టోరీ సిట్టింగ్స్ లో కొరటాల శివ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఆచార్య సినిమా రిలీజ్ కాగానే ఎన్టీఆర్ ప్రాజెక్టును కొరటాల శివ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అయితే ఎన్టీఆర్ సినిమా తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ తో కొరటాల శివ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి లాక్డౌన్ సమయంలోనే బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ని కొరటాలశివ రెడీ చేశాడట.
ఆ కథ బాలకృష్ణ మాత్రమే చేయగలిగేలా ఉంటుందని తెలుస్తోంది.ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు. అయితే తాను రెడీ చేసిన సబ్జెక్ట్‌ను కొరటాల శివ బాలయ్య కి వినిపించారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు కొరటాల శివ. మరి ఈ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక బాలకృష్ణ కి రెడీ చేసిన కథను వినిపిస్తాడేమో చూడాలి. ఇక బాలయ్య విషయానికి వస్తే.. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ షూటింగ్ పూర్తి చేశాడు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో తన 150వ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే...!!