చిత్ర పరిశ్రమకు పెద్ద సినిమాల అవసరం ఎంతో చిన్న చిత్రాల రూపకల్పన కూడా అంతే అవసరం. ఎందుకంటే భారీ చిత్రాలకు అధిక బడ్జెట్ మాత్రమే కాదు.. వాటిని తెరకెక్కించేందుకు పట్టే సమయమూ ఎక్కువే. ఈ కారణంగానే ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసేవారికి ఉపాధి కల్పించేందుకు చిన్నచిత్రాలు అవసరమేనని గతంలో దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పేవారు. అంతేకాదు..ఆయన ఆచరణలోనూ దానిని పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. ఒకపక్క ఎన్టీఆర్ ఏఎన్నార్ ల వంటి దిగ్గజ నటులతో భారీ చిత్రాలు తీస్తూనే మరోపక్క తక్కువ బడ్జెట్‌తో చిన్న నటులతోనూ తెరకెక్కించి ఆయన పలు విజయాలనందుకున్నారు. అంతేకాదు తన తరువాత తరం దర్శకులకు కూడా తరచుగా ఈ విధానమే పాటించాలని కూడా సూచించేవారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా దీన్నే ఫాలో కావాలని మొదట్లో భావించారు. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఆయన సునీల్ హీరోగా తెరకెక్కించిన మర్యాద రామన్న ఈ తరహా చిత్రమే. ఈగ చిత్రం కూడా స్టార్లకు ప్రాధాన్యం లేని చిన్న చిత్రంగానే మొదలుపెట్టినా ఆ తరువాత పెర్ఫెక్షన్కు పెద్దపీట వేసే రాజమౌళి శైలి కారణంగా సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిరావడంతో ఆ సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. అయినా రాజమౌళి నుంచి చిన్నసినిమాలుగా వచ్చి పెద్ద విజయాలందుకున్నవాటిగానే ఆ చిత్రాలను లెక్కించాలి.
ఇక ఆ తర్వాత బాహుబలి నుంచి రాజమౌళి టేకింగ్ మరో స్థాయికి వెళ్లిపోయింది. అది తెలుగు సినిమానే కాదు.. భారతీయ సినిమా స్థాయిని కూడా పెంచింది. ఇక ఆ ఇమేజ్‌ని వదిలి ఆయన చిన్న చిత్రాలవైపు మళ్లీ రావడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. దానికి తగినట్టుగానే రాజమౌళి నుంచి తాజాగా వస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద అత్యంత వ్యయంతో తెరకెక్కిన చిత్రంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన తదుపరి చిత్రాలు సైతం ఇంతకు మించిన స్థాయిలో మరింత భారీ బడ్జెట్ తో రూపొందే అవకాశాలే ఎక్కువ. అంటే ఇకపై దర్శకధీరుడి నుంచి మర్యాద రామన్న తరహా చిత్రాలు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలేమో..!