టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్- క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో ఆమధ్యన వచ్చిన చిత్రం స్పైడర్. నిజానికి మహేష్‌కు తెలుగులోనే కాదు.. తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక మురుగదాస్ గజనీ సినిమాతో సహా పలు హిట్ చిత్రాలను తెరకెక్కించి సంచలన దర్శకుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవితో తెలుగులో స్టాలిన్ చిత్రం తీసి మంచి విజయాన్నందుకున్నాడు. అందుకే అప్పట్లో మహేష్- మురుగదాస్ కలయికలో వచ్చే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఓవర్సీస్లో అత్యధిక స్క్రీన్లపై విడుదలైన సినిమాగా దీన్ని చెప్పుకోవాలి. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భారీ చిత్రం హీరో, దర్శకులకున్న ప్రత్యేక క్రేజ్ కారణంగా మొత్తంమీద మంచి కలెక్షన్లనే రాబట్టినా, మహేష్ అభిమానులను సంతృప్తి పరచడంలోనూ, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం ఆ సినిమాలో కథ, కథనంలో పెద్ద బిగి లేకపోవడం, మహేష్ ఇమేజ్ కు తగిన కథను దర్శకుడు మురుగదాస్ ఎంపిక చేసుకోకపోవడమేనన్న విమర్శలున్నాయి.
అంతకుముందు మహేష్.. ఆగడు, 1 నేనొక్కడినే, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలన్నీ దర్శకులపై పూర్తి నమ్మకం ఉంచి చేసినవే. ఇవన్నీ సూపర్‌స్టార్ కు షాక్ ఇవ్వడంతో ఆ తర్వాత దర్శకుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. తన ఇమేజ్ను పూర్తిగా అర్థం చేసుకుని అందరినీ మెప్పించే స్థాయిలో తెరపై చూపించగల దర్శకులకే మహేష్ ప్రాధాన్యమిస్తున్నాడట. దర్శకుడు కొరటాల శివతో తక్కువ సమయంలోనే రెండు సినిమాలు చేయడం వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు,భరత్ అను నేను రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ విజయాల లిస్టులో చేరిపోయింది. మహేష్ నుంచి రాబోతున్న తదుపరి చిత్రం సర్కార్‌వారి పాట చిత్రంతో దర్శకుడు పరశురామ్ కూడా మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్‌గా నిరూపించుకునే అవకాశాలు మస్తుగా ఉన్నాయని ఆ చిత్ర వర్గాలు చెపుతున్నాయి. ఇక ఆ తరువాత మహేష్ పని చేయబోయే చిత్రాలన్నీ క్రేజీ డైరెక్టర్ల కాంబినేషన్లోనేనని తెలుస్తుంది.