రాజమౌళి దర్శకత్వంలో పదేళ్ల క్రితం తెరకెక్కిన ఈగ చిత్రంలో విలన్‌గా నటించిన కన్నడ నటుడు సుదీప్ నటనను ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. అప్పట్లో ఆ సినిమా చూశాక దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్.. సుదీప్‌ను ప్రశంసిస్తూ "నాకన్నాగొప్ప విలన్ ఇంకెవరూ ఉండరేమోనని అనుకునేవాడిని. కానీ ఈగ చూశాక నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. నాకంటే నువ్వే గొప్ప విలన్‌వి" అన్న మాటలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. ఇంతకీ రజనీకాంత్ ఆ మాట అన్నది రోబో సినిమాలో ఆయన పోషించిన నెగెటివ్ రోల్‌ను గురించి అనుకుంటే పొరపాటే.. మరెందుకన్నారో తెలుసా..? తమిళనాట ఆరాధ్య నటుడిగా వెలుగొందుతున్న రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విలన్ పాత్రలే. అవును ఇప్పటి తరం నమ్మలేకున్నా ఇది నిజం. అంతేకాదు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కూడా మొదట్లో ఇలాగే సాగడం చిత్రమైన కో ఇన్సిడెంట్.
1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగల్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రజనీకాంత్ ఆ సినిమాలో పోషించింది నెగెటివ్ రోలే. ఆ తర్వాత ఏడాది తేడాతో అదే దర్శకుడి నుంచి వచ్చిన సినిమాలు మూండ్రుముడిచు, అవరగళ్ చిత్రాల్లోనూ రజనీది ఇదే తరహా పాత్ర. విశేషమేమిటంటే ఈ మూడు చిత్రాల్లోనూ కమల్‌హాసన్ హీరోగా నటించాడు. అంతేకాదు అదే సమయంలో వచ్చిన వయథినిలే, ఆడు పులి ఆట్టం చిత్రాల్లోనూ హీరో కమల్ కాగా విలన్ రజనీకాంత్. ఆ తర్వాత గాయత్రి, బిల్లా, నెట్రికాన్ వంటి చిత్రాలన్నింటిలోనూ రజనీకాంత్ పోషించింది విలన్ తరహా పాత్రలే. ఆ తర్వాత హీరోగా మారి తిరుగులేని విజయాలతో సూపర్‌స్టార్ మారాడు తలైవా. ఇక తెలుగులో దశాబ్దాలుగా మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి సినీ ప్రస్థానం కూడా మొదట్లో అనుకున్నంత సాఫీగా సాగలేదు. పునాదిరాళ్లు చిత్రంతో 1978లో వెండితెరకు పరిచయమైన చిరంజీవి పలు చిత్రాల్లో చిన్న పాత్రలు వేశారు. ఆ తర్వాత.. ఇది కథకాదు, 47 రోజులు, మోసగాడు, తిరుగులేని మనిషి, పున్నమినాగు, న్యాయంకావాలి వంటి చిత్రాలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు వేశారు. ఆ సినిమాల్లో మెప్పించడం ద్వారా హీరో పాత్రలకు ఎదిగారు. 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో ఆయనకు వెనక్కుతిరిగి చూసుకునే అవసరమే రాలేదు.