చిన్న సినిమాకు సమస్యగా మారిన పెద్ద రేటు !
ఈసంవత్సరం విడుదలైన చిన్న సినిమాలలో ఒక్క ‘ఉప్పెన’ ‘జాతిరత్నాలు’ సినిమాలు తప్ప మిగతా సినిమాలు అన్నీ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈపరిస్థితుల మధ్య అసలు చిన్న సినిమా రానున్న రోజులలో నిలబడగలుగుతుందా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఈపరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల పెంపుదల విషయంలో తీసుకున్న నిర్ణయంతో మల్టీ ప్లెక్స్ లలో టికెట్టు ధర 300 లకు చేరిపోఅవడంతో చిన్న సినిమాలను చూడటానికి అసలు ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారా అన్న చర్చలు మొదలయ్యాయి.
ఈరోజు విడుదల కాబోతున్న శ్రీవిష్ణు నటించిన ‘అర్జునా ఫల్గుణ’ మూవీ టిక్కెట్ల రేట్లు మల్టీ ప్లెక్స్ లో చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఈమూవీకి 295 రూపాయలు మల్టీ ప్లెక్స్ టిక్కెట్ రేటుగా నిర్ణయించారు. ఒక చిన్న హీరో సినిమాకు ఈ రేంజ్ లో టిక్కెట్ రేటు పెడితే కనీసం మొదటిరోజు సగం మంది ప్రేక్షకులు అయినా వస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి.
నిన్న ప్రముఖ నటుడు విప్లవ సినిమాల నిర్మాత ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ చిన్న సినిమాలకు కూడ ఎక్కువ రేట్లు పెడితే జనం రారు సరి కదా భవిష్యత్ లో చిన్న సినిమాలు కనుమరుగైపోతాయి అంటూ కామెంట్ చేసాడు. ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లు పెంచడం లేదని అక్కడ సమస్యలు ఏర్పడుతూ ఉంటే తెలంగాణాలో టిక్కెట్ల రేట్లు పెంచినా చిన్న సినిమాలకు ఏమాత్రం కలిసి రాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..