జూనియర్ ఎన్టీఆర్ అని ఎవరైనా తనను పిలవడం అంటే.. తారక్ కు అసలు ఇష్టం ఉండదు. ఎన్టీఆర్ అంటే తన తాత ది గ్రేట్ లెజెండరీ నటుడు, ప్రజా నాయకుడు.. ఆయనకు ఎవరూ సాటి లేరు.. రాలేరు..నాతో సహా..అంతే అంటాడు తారక్. అయితే తాత పోలికలు ఉండటం వల్లనో ఆయనలోని పట్టుదల కూడా వారసత్వంగా రావడం వల్లనో గానీ చిన్న వయసులోనే స్టార్‌గా ఎదిగాడు. ఆ తరువాత వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎదురైన ఒడిదుడుకులను వయసుకు మించిన పరిణితితో ఎదుర్కొని ఇప్పుడు తన కెరీర్ పీక్ దశలో కొనసాగుతున్నాడు. అయితే టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఉన్న తారక్ నుంచి మూడేళ్లుగా సినిమా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేనని చెప్పాలి. స్టార్‌డమ్ కలిగిన ఓ మాస్ హీరో అభిమానులకు ఇది ఎంతమాత్రం రుచించని విషయమే. టెంపర్, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, జైలవకుశ, అరవిందసమేత వంటి వరుస హిట్ల తరువాత తారక్ సినిమా వచ్చి మూడేళ్లవుతోంది.
అయితే తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు జక్కన్న కు ఆర్ఆర్ఆర్ కోసం బల్క్ కాల్షీట్లు కేటాయించాల్సిరావడంతోనే తారక్ సినిమాల మధ్య ఇంత గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. దానికి తోడు మధ్యలో కరోనా పాండమిక్ పరిస్థితుల కారణంగా చాలా సినిమాల షెడ్యూళ్లు లేటవడంతో ఎన్టీఆర్ కొత్త సినిమాలు పట్టాలెక్కలేదు. ఇక 2022 ఏడాది తొలివారంలోనే ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకులముందుకు వస్తుండటంతో తారక్ అభిమానుల ఆకలిని ఈ సినిమా తీర్చే అవకాశం మస్తుగా ఉంది. ఆ తరువాత గతంలో మాదిరిగా కాకుండా పక్కా ప్లానింగ్‌తో ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తప్పకుండా చేసేలా యంగ్ టైగర్ ప్రణాళికతో ఉన్నాడట. ఇక ఆర్ఆర్ ఆర్ ప్రమోషన్ల కార్యక్రమం తరువాత వరుసగా కొరటాల శివతో, ఆ తరువాత త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాలతో పాటు ఇప్పటికే విన్న మరికొన్నికథలను ఫైనలైజ్ చేసే పనిలో తారక్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అతడి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కే అవకాశం ఉండటంతో తారక్ ప్లాన్ ఎంతవరకు అమల్లో సాధ్యమో చూడాల్సి ఉంది.