సినీ పరిశ్రమను కుదేలయ్యాలా చేసిన కోవిడ్-19 అదే సమయంలో కొన్నిపాఠాలనూ నేర్పింది. ఒక్కోసారి ఇలాంటి ఊహించని ఉత్పాతాలూ ఎదురవుతాయనే హెచ్చరిక అది. ఇలాంటి సమయాల్లో పరిశ్రమను ఎలా బ్రతికించుకోవాలన్నది ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది సినిమ వర్గాలే. తెలుగు సినిమా స్థాయి పెంచే భారీ ప్రాజెక్టుల రూప కల్పన ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే అత్యధిక వ్యయంతో నిర్మాణమయ్యే ఇలాంటి చిత్రాలు పూర్తి కావడానికి వెచ్చించాల్సిన సమయమూ ఎక్కువే ఉంటుంది. అందుకే వీటి మధ్యలో చిన్న సినిమాలూ చేసేందుకు స్టార్ హీరోలు సైతం సిద్ధం కావాల్సిన అవసరాన్ని కోవిడ్ పాండమిక్ పరిస్థితులు చాటి చెప్పాయనుకోవాలి. దీనివలన హీరోలు తమ సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో అటు పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలకూ కాస్త మెరుగైన ఉపాధి లభిస్తుంది కూడా.
నిజానికి ఓటీటీ రూపంలో పరిశ్రమకు, ముఖ్యంగా చిన్న సినిమాకు మంచి వేదిక దొరికింది. గత ఏడాది ఓటీటీలో విడుదలైన మంచి సినిమాలకు బాగానే ఆదరణ లభించింది. వెంకటేష్ నారప్ప మూవీతో పలు ఇతర హీరోల సినిమాలు ఈ వేదికపైనే రిలీజై విజయవంతమైన విషయం తెలిసింది. అదే బాటలో ఇతర స్టార్ హీరోలు కూడా కాస్త తక్కువ బడ్జెట్ తో రూపొందే సినిమాల్లో నటిస్తే ఓటీటీకి మరింత ఆదరణ పెరుగుతుంది. అయితే భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల చేస్తే ఆ వ్యయాన్నితిరిగి రాబట్టుకోవడం కష్టమే. అలాంటి సినిమాలను థియేటర్లలో చూసేందుకే ప్రేక్షకులు మెగ్గుచూపుతారు. అలాగే థియేటర్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇండస్ట్రీపైనే ఉంది నిజమే. కానీ ప్రజలు థియేటర్లకు రాలేని పరిస్థితులున్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు..? థియేటర్లైనా ఇండస్ట్రీ అయినా ముందు సినిమాకు పెట్టుబడి పెట్టే నిర్మాత ఉంటేనే గదా మనుగడ సాగించగలిగేది. సినిమా ప్రచారం, ప్రమోషన్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎవరూ ఊహించని విధంగా విడుదల వాయిదా వేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన తారక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. ఈ చిత్రం వాయిదా పడటంతో ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. మధ్యలో ఓ చిన్న సినిమా చేసి ఉంటే ఓటీటీ నైనా అభిమానులను పలకరించే అవకాశం ఉండేది.