టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న దేవిశ్రీప్రసాద్ తాజాగా 'పుష్ప' సినిమాతో బాలీవుడ్లోనూ తన మ్యూజిక్ తో దుమ్మురేపుతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా హిందీ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ ల పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ సంగీత దర్శకులకు తగిన క్రెడిట్ లభించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు దేవి శ్రీ ప్రసాద్. ఇక ఇంటర్వ్యూలో రీమేక్ ల మధ్య హిందీ పరిశ్రమ శోభను కోల్పోయిందా? అనే ప్రశ్న దేవిశ్రీప్రసాద్ ఎదురైంది.
ఇక ఈ విషయంపై దేవిశ్రీప్రసాద్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ..' నేను నిజంగా రీమేక్, రీమిక్స్ లను ఇష్టపడను. వాస్తవానికి ఇది నా సూత్రం. పాటలను రీమేక్ చేయొద్దు. తెలుగు, తమిళంలో కూడా పాత పాటలను రీమేక్ చేయాలని నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను తిరస్కరించాను. నేను రీమిక్స్ అనేవి చేయను. నా సొంత పాటను మాత్రం రీమేక్ చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నాను అంటే ఒక భాష నుండి మరొక భాష కు ఆ పాటను ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు' అని అన్నారు దేవిశ్రీ. ఒక పాట కోసం స్వరకర్త నిజంగా చాలా కష్టపడతాడు. సంగీతం అనేది మీరు ఒక్కరోజు మేల్కొని చేయగలిగేది కాదు.
సంగీతం అనేది ఒక ఎమోషన్. కాబట్టి మీరు ఒక హిట్ సాంగ్ చేయడానికి మీ జీవితమంతా సంగీతం తోనే జీవించాలి. అందుకే ఎవరైనా జీవితాన్ని అంకితం చేస్తున్నప్పుడు అందుకు తగ్గ క్రెడిట్ స్వరకర్తకే దక్కుతుంది అని నేను భావిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో పాటు పుష్ప సినిమాలో సమంత నటించిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మామ ఊహూ అంటావ మామ' సాంగ్ వివాదంపై దేవిశ్రీ మాట్లాడుతూ..' ఈ పాట బాగా లేకపోతే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని అన్నారు. ఇక ఈ విషయంపై తాను ఎక్కువగా రియాక్ట్ కాదలచుకోలేదని వెల్లడించాడు దేవి శ్రీ ప్రసాద్. దీంతో రీమిక్స్ సాంగ్స్ పై దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి...!!