‘SK 20’: శివ కార్తికేయన్ సినిమాలో హాలీవుడ్ భామ.. ఆ పాత్ర కోసమేనా..?!
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో హీరో శివకార్తికేయన్ ఒకరు. అద్భుతమైన నటనతో ఇప్పటికే అభిమానుల్లో మంచి మార్క్ సంపాదించుకున్నారు. కార్తీకేయన్‌కు తమిళ ఇండస్ట్రీతోపాటు తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలొయింగ్ అధికం. ఇప్పటివరకు నటించిన పలు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అయితే తాజాగా ఆయన యువ దర్శకుడు అనుదీప్ కేవీ డైరెక్షన్‌లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా.. అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌లపై.. పుస్కుర్ రామ్ మోహన్, నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాను ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంచారు. రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం యూకేలోని లండన్ నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శివకార్తికేయన్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ భామను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘ఎస్‌కే 20’ అనే వర్కింగ్ టైటిల్ కూడా ఇచ్చింది చిత్ర బృందం. హాలీవుడ్ నటి ఉక్రెయిన్ భామ మరియా ర్యాబోశాప్క.. శివకార్తికేయన్ సరసన నటించనున్నట్లు టాక్. అలాగే గతంలో ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ ఒలివియా మోరిస్‌ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. తాజాగా ఈ జాబితాలో మరియా ర్యాబోశాప్క చేరింది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. కాగా ఎస్‌కే 20 సినిమా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందించబడుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా ఇండియాలో పాండిచ్చేరి, యూకేలోని లండన్ నేపథ్యంలో ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.