త్రివిక్రమ్.. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావ్..!
త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేశ్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించి నాలుగేళ్లు దాటింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా సెట్స్‌కి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత త్రివిక్రమ్ మూడు సినిమాలు తీశాడు. 'అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో' సినిమాలు విడుదల చేశాడు. ఇప్పుడు మహేశ్ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్తున్నాడు. కానీ వెంకటేశ్ మూవీ విషయంలో మాత్రం స్పష్టత లేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి రెండేళ్లు దాటింది. చిరంజీవి స్వయంగా పబ్లిక్ ఈవెంట్‌లో డి.వి.వి.దానయ్య బ్యానర్‌లో త్రివిక్రమ్‌తో సినిమా చేస్తానని చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక త్రివిక్రమ్ మహేశ్ సినిమాతో బిజీ అయితే చిరంజీవి, 'గాఢ్‌పాదర్, భోళా శంకర్' సినిమాలు చేస్తున్నాడు. అలాగే బాబీ, వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టాడు.
కమర్షియల్ సినిమా ట్రెండ్ మొదలయ్యాక కాంబినేషన్ లెక్కలతో సినిమాలు తెరకెక్కడం ఎక్కువైంది. హిట్ కాంబినేషన్లు, క్రేజీ కాంబినేషన్ల ఈక్వేషన్లతో సినిమాలు తీస్తున్నారు. అయితే అనౌన్స్‌మెంట్ వచ్చాక కథ కుదరకపోతే ఆ ప్రాజెక్ట్స్‌ని హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. అందుకే చాలామంది స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో పెండింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. వేణు శ్రీరామ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'ఐకాన్' సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చి మూడేళ్లు దాటింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌కి వెళ్తుందనేది మాత్రం క్లారిటీ లేదు. అల్లు అర్జున్ 'పుష్ప2'తో పాటు కొరటాల శివతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. అలాగే ప్రశాంత్‌నీల్‌తో ఒక సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు వేణు శ్రీరామ్ మాత్రం 'వకీల్‌సాబ్' తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు.
తేజ కొన్నాళ్లుగా సక్సెస్ రేసులో మునుపటిలా సత్తా చాటలేకపోతున్నాడు. 11 ఏళ్ల ఫ్లాపులకి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో బ్రేకులేసినట్లు కనిపించిన తేజ, 'సీత' సినిమాతో మళ్లీ ఫ్లాపులో పడ్డాడు. ఈ ఫెయిల్యూర్స్‌లో ఉన్న టైమ్‌లో వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు తేజ. 'అలివేలుమంగ వేంకటరమణ, రాక్షసరాజు రావణాసురుడు' సినిమాలు అనౌన్స్ చేశాడు. గోపీచంద్, రానాతో ఈ సినిమాలు తీస్తామని చెప్పాడు. అలాగే 'చిత్రం' సీక్వెల్‌గా 'చిత్రం 1.1' ప్రకటించాడు. కానీ వీటిల్లో ఒక్క సినిమా కూడా స్టార్ట్ చేయలేదు.