ఆ శుభవార్త త్వరలోనే.. పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన నాని
ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాల విషయంలో గతంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో సినీ వర్గాలు ప్రభుత్వంతో చర్చలు జరిపినా పెద్దగా ఫలితం లేదు. ఇటీవల చిరంజీవి నేరుగా ఒకసారి, తన బృందంతో కలసి మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీల ఫలితంగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అనుకున్నారంతా. చిరంజీవి కూడా త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ అది వినపడలేదు, దాని జాడ కనపడలేదు. కనీసం భీమ్లా నాయక్ సినిమా ముందయినా ఆ శుభవార్త వినిపిస్తుందేమోనని అభిమానులు ఆశపడినా ఫలితం లేకుండా పోయింది.
మంత్రి నాని క్లారిటీ..
భీమ్లా విడుదల విషయంలో మరో నాలుగు రోజులు ఆగి ఉండాల్సింది కదా, ప్రస్తుతానికయితే పాత నిబంధనలే ఉన్నాయి కదా అన్నారు మంత్రి నాని. సినిమా విడుదల విషయంలో అభిమానుల హడావిడి, ప్రతిపక్షాల రాజకీయ విమర్శలపై ఆయన స్పందించారు. పాత నిబంధనలు అమలులో ఉన్నప్పుడు సినిమాలు విడుదలైతే ఆ నిబంధనలే వర్తిస్తాయి కదా అంటూ ప్రశ్నించారు. మరికొన్ని రోజులు ఆగితే టాలీవుడ్ కి శుభవార్త వస్తుందని పరోక్షంగా హింట్ ఇచ్చారు. మంత్రి హింట్ ఇవ్వడంతో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల నిర్మాతలు నిజంగానే పండగ చేసుకుంటున్నారు. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సహా పెద్ద సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి విడుదలకు ముందే ప్రభుత్వం ఏపీలో సినిమాల విడుదల విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి తెస్తే నిర్మాతలకు మేలు చేకూరినట్టవుతుంది. బెనిఫిట్ షో లతో అదనపు ఆదాయం వస్తుంది, తొలివారం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమిస్తే అది మరింతగా ఉపయోగపడుతుంది. అందుకే సినిమాలు విడుదలకు సిద్ధం చేసిన నిర్మాతలు, ఏపీలో కొత్త నిబంధనల కోసం వేచి చూస్తున్నారు.