రామ్ కు ఆలోచనలు కలిగిస్తున్న అల్లు అర్జున్ కన్ఫ్యూజన్ !
‘వకీల్ సాబ్’ లాంటి భారీ హిట్ తీసినప్పటికీ వేణు శ్రీరామ్ గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉంటున్నాడు. తాను వ్రాసుకున్న ‘ఐకాన్’ మూవీ సబ్జెక్ట్ అల్లు అర్జున్ కు బాగా నచ్చినప్పటికీ ఆ మూవీని తీయడానికి దిల్ రాజ్ లాంటి భారీ నిర్మాత ముందుకు వచ్చినా ఈమూవీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేకపోయింది.
‘పుష్ప’ సూపర్ సక్సస్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడంతో అతడి ఆలోచనలు మారిపోయి ప్రస్తుతం అతడి దృష్టి అంతా ‘పుష్ప 2’ పై ఉంది. దీనితో వేణు శ్రీరామ్ చేసేది లేక తాను తయారుచేసుకున్న ‘ఐకాన్’ కథకు వేరే హీరో అన్వేషణలో పడ్డాడు. ఇలాంటి పరిస్థితులలో రామ్ పై వేణు శ్రీరామ్ దృష్టి పడినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు వేణు శ్రీరామ్ ఈమధ్య రామ్ ను కలిసి ‘ఐకాన్’ మూవీ కథను వినిపించినట్లు టాక్. ఈ కథ రామ్ కు బాగా నచ్చడంతో ఈమూవీలో నటిస్తానని రామ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రామ్ లింగ్ స్వామి దర్శకత్వంలో ‘వారియర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ తరువాత బోయపాటితో రామ్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. దీనితో వేణు శ్రీరామ్ కు రామ్ దగ్గర కూడా వేచి చూడవలసిన పరిస్థితి.
ఇప్పటికే అల్లు అర్జున్ కోసం ఒక సంవత్సర కాలం వెయిట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు రామ్ గురించి ఇంకా ఎంతకాలం వేచి చూడవలసి వస్తుందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో దాసరి రాఘవేంద్రరావు లాంటి ప్రముఖ దర్శకులు టాప్ హీరోల డేట్స్ గురించి వేచి చూడకుండా చిన్న హీరోలతో కూడ సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటి దర్శకులు అంతా ఒక హిట్ వచ్చిన తరువాత వెంటనే టాప్ హీరోతో సినిమా చేయాలి అని కోరుకుంటున్న పరిస్థితులలో దర్శకులకు ఇలాంటి పరిస్థుతులు వస్తున్నాయి అనుకోవాలి..