పల్లెకు పోదాం ఛలో అంటోన్న హీరోలు..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు 'శ్రీమంతుడు' చిత్రంలో తిరిగి ఊర్లకి వెళ్లిపోదాం, గ్రామాలని దత్తత తీసుకుందాం అనే కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పల్లె రాజకీయాలు, ప్రతీకారం నేపథ్యంలో 'రంగస్థలం' చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఇక సింహాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో 'పుష్ప-ది రైజ్' చేసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ జీవితంలో ఎన్నడూ చూడని కలెక్షన్లు చూశాడు.
ఇక నాని కుటుంబ కథా చిత్రాల ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ కొంచెం రెగ్యులర్ రోల్స్‌లోనే కనిపిస్తుంటాడు. అయితే తొలిసారి 'దసరా' చిత్రంతో రఫ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. కోల్ మైనింగ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఆదరణ పొందుతుందని అంతా అనుకుంటున్నారు. ఇక సాయి ధరమ్ సాయితేజ్ ఎక్కువగా మాస్ చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు. 'చిత్రలహరి, సోలో బ్రతుకే సో బెటర్' లాంటి కుర్రకారును ఆకట్టుకునే కథాంశంతో ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. అయితే సాయి ధరమ్ తేజ్ పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ తో సాగే మిస్టీరియస్ థ్రిల్లర్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
కథలో కొత్తదనం ఉంటేనే టిక్కెట్లకు గిరాకీ పెరుగుతుంది. హీరోలను ఎప్పుడూ చూడని లుక్ లో కనిపిస్తే ప్రేక్షకులను ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. ఈ మార్పు కోసమే చాలామంది హీరోలు, మెట్రో సిటీ కథలకి బ్రేక్ ఇచ్చి గ్రామాల్లోకి వెళ్తున్నారు. పల్లెటూరి కుర్రాళ్లులా మారిపోతున్నారు. పల్లెటూరి పిల్లగాడిగా 'జయం' సినిమా చేసి బ్లాక్‌బస్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్, ఆ తర్వాత ఎక్కువగా పల్లె కథల్లో నటించలేదు. మధ్యలో 'అఆ' లాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీస్ చేసినా, మోడ్రన్లుక్లోనే కనిపించాడు. అయితే నితిన్ తాజా మూవీ 'మాచర్ల నియోజకవర్గం' మాత్రం మొత్తం రూరల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌తో వస్తోంది.