ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా..?

Deekshitha Reddy
ఏపీలో ఆమధ్య సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు, ఆ తర్వాత పెంచారు, సినిమా సినిమాకీ మరింతగా పెంచుకోవచ్చనే జీవో కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవో ప్రకారం సినిమా టికెట్ రేట్లు మరింతగా తగ్గబోతున్నాయని తెలుస్తోంది.

ఎందుకు తగ్గుతాయి..?
ఇప్పటి వరకూ సినిమా టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలంటే.. మధ్యలో వెబ్ సైట్లు కమిషన్ తీసుకుంటాయి. దాదాపు 12నుంచి 15 శాతం వరకు కమిషన్ గా వెళ్లేది. అయితే ఇప్పుడు ఆ కమిషన్ ని ప్రభుత్వం 1.95 శాతానికి తగ్గించింది. ప్రభుత్వమే తమ తరపున ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ద్వారా టికెట్లు విక్రయించబోతోంది. ఇందులో సర్వీస్ ప్రొవైడర్ కి 0.95 శాతం కమిషన్. మిగిలిన 1 శాతం సినీ పరిశ్రమ అభివృద్ధికి కేటాయించబోతున్నారు. దీంతో సహజంగానే టికెట్  రేట్లు తగ్గుతాయని అంటున్నారు.

సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయాలకు సంబంధించి హోం శాఖ తాజాగా జీవో జారీచేసింది. ఆన్‌ లైన్‌ లో సినిమా టికెట్ల విక్రయ విధానం వీలైనంత త్వరగా అమలులోకి రాబోతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్లకు చెప్పారు. సీఎం జగన్ చేతుల మీదుగా త్వరలో ఆన్ లైన్ టికెట్ల విక్రమం లాంఛనంగా మొదలవుతుందని అన్నారాయన. ఏపీలో ప్రస్తుతం 1,140 సినిమా  థియేటర్లున్నాయి. ఇవన్నీ ఎఫ్డీసీతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎంవోయూ కాపీలను కూడా ఎఫ్డీసీ ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు..  థియేటర్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఎంవోయూలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారం లోగా ఈ ఎంవోయూల ప్రకారం టికెట్ విక్రయాలు మొదలవుతాయి.

ఆన్‌ లైన్‌ లో సినిమా టికెట్ల అమ్మకాల కోసం సినిమా థియేటర్ల వారీగా ఉన్న సీటింగ్ కెపాసిటీని నిర్ధారిస్తారు. ఇందులో అవకతవకలకు అవకాశం లేకుండా థియేటర్లో ఉన్న సీట్లను మ్యాపింగ్‌ చేస్తారు. ప్రస్తుతం ఏపీలో ఏ థియేటర్ కెపాసిటీ ఎంత  అనేది సరైన లెక్క లేదు. ఇకపై అన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి. అన్ని టికెట్లు ఆన్ లైన్లోనే అమ్మాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: