అమ్మ, అవకాయ్, అంజలీ, 'నువ్వే నువ్వే' ఎప్పుడూ బోర్ కొట్టవు - తరుణ్ ఎమోషనల్ స్పీచ్
ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అక్టోబర్ 10(2022) నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్ లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనలో సినిమా యూనిట్ పాల్గొన్నది. షో అనంతరం నాటి ఈ సినిమా అనుభవాలను దర్శక నిర్మాతలు, నటీనటులు పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హీరో తరుణ్ చాలా ఎమోషన్ అయ్యారు. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే.. ఎప్పటికీ బోర్ కొట్టవని చెప్పారు. "'నువ్వే నువ్వే' సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా... ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో సినిమా చూస్తా. నన్ను 'నువ్వే కావాలి'తో రామోజీరావు గారు, 'స్రవంతి' రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో 'నువ్వే నువ్వే', 'ఎలా చెప్పను?' సినిమాలు చేశాను. ఈ సంస్థలో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. హీరోగా నా తొలి సినిమా 'నువ్వే కావాలి'కి త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎంత మంది హీరోలతో చేసినా... ఆయన ఫస్ట్ హీరో నేనే. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి ఈ సినిమాలో తొలి సారి చేశా. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. శ్రియతో చాలా చక్కటి అనుబంధం ఉంది. ఇద్దరం కలిసి మూడు సినిమాలు చేశాం. సెట్స్ లో ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. ఆమెతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇతర నటీనటులు అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. 'నువ్వే నువ్వే' లాంటి సినిమా ఇంకొకటి చేయమని చాలా మంది అడుగుతారు. నాకు ఇటువంటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్" అని తరుణ్ చెప్పాడు.
తనలోని రచయితను, దర్శకుడిని తన కంటే ఎక్కువగా గుర్తించిన వ్యక్తి రవికిశోర్ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. తన కథ విని ఎంతో నమ్మి 'నువ్వే నువ్వే' సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రవి కిశోర్ ఇచ్చారన్నారు. ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదన్నారు. అటు సిరివెన్నెలతో తనకున్న అనుబంధం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదన్నారు స్రవంతి కిశోర్. ఆ మహనీయుడికి 'నువ్వే నువ్వే' సినిమాను అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.