హీరో, హీరోయిన్ లేని తొలి సినిమా!
అందరూ తీసే సినిమా కాకుండా సరికొత్త ప్రయోగం చేయాలనుకున్నారు. అలా ‘రాయి పలికిన రాగాలు ’ సినిమా తీశారు.
ఈ సినిమా అనుభవాలను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ భారతి ‘‘ ఈ సినిమా షూటింగ్ అంతా మదనపల్లి, తిరుపతి ప్రాంతాల్లో జరిగింది. నటీనటులతో సినిమా తీసే స్తోమతు మా కాడ లేక పూర్తిగా ప్రకృతి మధ్య తీశాం. వివిధ ఆకారాల్లోని రాళ్లనే నటులుగా చూపిస్తూ కథను అల్లుకున్నాం. ఈ రాళ్ల గుట్టల్లో ఎందరో ప్రేమికులు కలుస్తుంటారు. కొన్ని ప్రేమలు విషాదంగా ముగిసాయి. అలా జరగ కూడదని చెప్పడం కోసమే ఈ సినిమా ! ఆత్మహత్యలు ప్రేమకు పరిష్కారం కాదని ధైర్యంగా ముందుకు సాగాలని జీవితం అన్నింటి కంటే విలువైనది అని చెప్పడానికే ఈ వినూత్న ప్రయోగం చేశాం.’’ అంటారు భారతి. ఆమె పశుపోషణ చేయడమే కాక స్వతహాగా రచయిత్రి.
‘ఎడారి బతుకులు’ కథా సంకలనం ప్రచురించారు. కొన్ని అవార్డులు కూడా పొందారు. ఈ సినిమాకు రచన చేసిన మరొకరు జయంతి. ‘‘ దాదాపు రెండు నెలలు ఈ సినిమా కోసం షూటింగ్ చేశాం. వివిధ భంగిమల్లో ఉన్న రాళ్ల కోసం తీవ్రంగా వెతికాం. చివరికి మా కథకు తగిన రాళ్లు దొరికాయి. మనుషుల అనుభూతులన్నీ రాళ్లలో పలికించాం. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక వినూత్న ప్రయోగం అవుతుంది.’’ అన్నారు జయంతి. దాదాపు పదిమంది గ్రామీణ మహిళలు ఈ సినిమా కోసం పనిచేశారు. వీరికి సంబంధించి మరో విశేషం కూడా ఉంది. వీరంతా అన్నమయ్య జిల్లా నుండి వెలువడుతున్న ‘నవోదయం’ పత్రికకు విలేఖరులుగా పనిచేస్తున్నారు.
రాయల సీమలోని అనేక సామాజిక సమస్యల పై వీరు కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీశారు.