టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని అలరించిన వీళ్లు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అందర్నీ అలరించడానికి రెడీ అవుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నుండి మొదలుకొని ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఇప్పటికే తమ సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలతో భారీగా రెమ్యూనరేషన్ సైతం డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల 'వాల్తేరు వీరయ్య' సినిమా కోసం 50 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇప్పుడు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ ని పెంచారు.
పవన్ కళ్యాణ్ తాజాగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పవన్ సుమారు 75 కోట్ల వరకు డబ్బు రూపంలో తీసుకోవడమే కాకుండా సినిమా లాభాల్లో మూడో వంతు కూడా రెమ్యునరేషన్ గా తీసుకుంటారట. అంతేకాకుండా అదనంగా కొంత భాగాన్ని ఈ ప్రాజెక్టును సెట్ చేసిన త్రివిక్రమ్ కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆపై మిగిలిన సగం నిర్మాత దానయ్యకు చేరుతుందట. అలా పవన్ కళ్యాణ్ మొత్తంగా రూ. 175 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమాకి సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సాహూ వంటి పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు సుజిత్. ఈ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకోవాలని సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ పై భారీ కసరత్తులు చేస్తున్నాడట.మరోవైపు ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని ఇప్పటికే వార్తలు రావడం జరిగింది.అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే పవర్ స్టార్ కెరీర్ లోనే మొట్టమొదటిసారి రెండు భాగాలుగా విడుదలయ్యే సినిమా ఇదే అవుతుంది...!!