టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోల్లో ఒకరైన కింగ్ నాగార్జున గత కొంతకాలంగా నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. గత ఏడాది నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా ఈసారి భారీ హిట్ కొట్టాలని నాగార్జున మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తుండగా.. అటు ఆయన అభిమానులు కూడా నాగార్జున ఎప్పుడు హిట్ సినిమా తీస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మధ్య ప్రముఖ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో నాగార్జున ఓ సినిమాని ప్లాన్ చేశారు. ఓ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని కూడా అనుకున్నారు.
కానీ పలు అనివార్య కారణాలవల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఇక నాగార్జున తోటి హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ మిగతా వాళ్లతో పోలిస్తే నాగార్జున మాత్రం చాలా వెనకబడిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోగా.. అటు బాలయ్య కూడా ఆఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు వెంకటేష్ ఈ మధ్యనే రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సీనియర్ హీరోల్లాగే నాగార్జున కూడా మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్ తో రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్రసన్నకుమార్ బెజవాడతో అనుకున్న మూవీ తాజాగా క్యాన్సిల్ అవడంతో నాగార్జున ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసన్నకుమార్ బెజవాడ కంటే ముందు ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మోహన్ రాజా తో నాగార్జున ఓ మల్టీ స్టారర్ మూవీ చేయాలని అనుకున్నాడు. ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరి ఇప్పుడైనా ఈ మల్టీ స్టారర్ ని నాగార్జున పట్టాలెక్కిస్తాడేమో చూడాలి...!!