టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ ఇటీవల కాలంలో వరుస ప్లాపులను ఎదుర్కొంటున్నాడు. అప్పుడెప్పుడో మహానుభావుడు సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత నటించిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటిం సినిమాలతో వరుసగా 6 ప్లాపులు అందుకున్నాడు. అయితే గత ఏడాది చివర్లో వచ్చిన 'ఒకే ఒక జీవితం' సినిమా ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా శర్వానంద్ ప్లాప్స్ కి కాస్త బ్రేక్ వేసినట్లు అయింది. ఇక ఈ ప్లాప్స్ వల్ల తన ఇమేజ్కి సెట్ అయ్యే కథలు సెలెక్ట్ చేసుకోవాలని శర్వానంద్ కి అర్థమైంది. ఈ క్రమంలోనే ఇటీవల తన 35వ సినిమాని అధికారికంగా ప్రకటించాడు.
హీరో సినిమాతో ప్లాప్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు శర్వానంద్. అతనే కెమెరామెన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని 118 సినిమాతో దర్శకుడుగా మారిన కె.వి గుహన్. 118 హిట్ తర్వాత WWW, హైవే వంటి సినిమాలు తీశాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలు థియేటర్లో కాకుండా ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమాలకి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అలాంటి కె.వి గుహన్ తో శర్వానంద్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఇప్పటికే కథ వినడం, దానికి ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయట. థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్టుని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వరుస ప్లాపులతో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న శర్వానంద్ మళ్లీ ఒక ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో సర్వత్ర ఆసక్తికరంగా మారింది. శర్వానంద్ నటిస్తున్న తన 35 సినిమా డైరెక్టర్ కి కూడా ఒక్క హిట్టు లేదు. అలాంటిది శర్వానంద్ ఈ ఇద్దరు దర్శకులకు ఛాన్స్ ఇచ్చి తన కెరీర్ని రిస్క్ లో పెడుతున్నాడని వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇద్దరు డైరెక్టర్స్ తో శర్వానంద్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాయో చూడాలి...!!