పవన్ టాప్ హీరోల నామస్మరణ వెనుక ఆంతర్యం !
పవన్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఆవేశంతో పాటు వ్యూహాత్మకంగా మాట్లాడటం బాగా అలవాటు చేసుకున్నాడు. లేటెస్ట్ గా జరిగిన ‘బ్రో’ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన తోటి టాప్ హీరోలపై కురిపించిన ప్రశంసల వెనక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘బ్రో’ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ "నాకు హీరోలందరూ ఇష్టమే. హీరోలంతా కష్టపడతారు. ప్రభాస్, రానా తరహాలో ఏళ్ల తరబడి కష్టపడడం నాకు రాదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లా నేను డాన్సులు చేయలేను" అంటూ ప్రశంసలు కురిపిస్తూ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా ప్రపంచ స్థాయిలో ఘనవిజయం సాధిస్తుంది అంటూ మహేష్ అభిమానుల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించాడు.
"ఆర్ ఆర్ ఆర్’ ‘బాహుబలి’ లాంటి హిట్స్ కొట్టాలని తనకు ఉంటుందని అంటూ తాను జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లా విపరీతంగా కష్టపడలేను అని అన్నాడు. దీనితో పవన్ కళ్యాణ్ నోటి వెంట టాప్ హీరోల భజన ఎందుకు వచ్చింది అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి. కేవలం తన అభిమానుల ఓట్లు మాత్రమే కాకుండా మిగతా అందరి హీరోల అభిమానుల ఓట్లు తన పార్టీకి అవసరం అన్న నిజాన్ని గ్రహించి పవన్ కళ్యాణ్ ఈవిధంగా తన తోటి హీరోల పై ప్రశంసలు కురిపించి ఉంటాడు అని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు..