చంద్రముఖి2 రివ్యూ: లారెన్స్ రజినీలా మెప్పించాడా?

Purushottham Vinay
రెండు దశాబ్దాల కిందట తమిళ-తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హారర్ అండ్ థ్రిల్లర్ సినిమా 'చంద్రముఖి'. ఇక దానికి కొనసాగింపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రముఖి-2 సినిమా తీశాడు పి.వాసు. రజినీకాంత్ స్థానంలోకి రాఘవ లారెన్స్ రాగా.. చంద్రముఖి పాత్రను బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు పదుల సంఖ్యలో  వచ్చాయి. కానీ ఈ జానర్ సినిమాలన్నీ ఒక మూసలో సాగిపోవడంతో కొన్నేళ్లకు జనాలకు బోర్ కొట్టేసింది. హార్రర్ కామెడీ అంటేనే అబ్బా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చంద్రముఖి-2 సినిమాలు తీసిన పి.వాసు ఆల్రెడీ 'చంద్రముఖి'కి కొనసాగింపుగా తెలుగులో 'నాగవల్లి' అనే సినిమాని తీసి మన ప్రేక్షకుల తలలు బొప్పి కట్టేలా చేశాడు. ఇక లారెన్స్ నటుడిగా-దర్శకుడిగా హార్రర్ కామెడీ జానర్ ను ఎంతగా సక్సెస్ అయ్యాడో తెలిసిందే. ఇలాంటి కలయికలో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 'చంద్రముఖి-2' సినిమా వచ్చింది. ఆల్రెడీ ఒకసారి 'నాగవల్లి' సినిమాతో చంద్రముఖిని చెడగొట్టింది గాక ఇప్పుడు 'చంద్రముఖి' పేరే పెట్టుకుని ఆ బ్లాక్ బస్టర్ మూవీకి ఇంకో 'నకిలీ'ని తయారు చేశాడు పి.వాసు.


కథ పరంగా.. నటన పరంగా చూస్తే ఇది అస్సలు నచ్చదు.ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటించి రజినిని మ్యాచ్ చెయ్యడం కాదు కదా అసలు ఆయన దారిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. ఇక సినిమాలో లారెన్స్ రజినీ స్థానంలో చూడటం ఒక రకంగా ప్రేక్షకులకు నిరాశ కలుగుతుందనే చెప్పాలి. రజినీ ఎంతో సెటిల్ గా.. మెస్మరైజ్ చేసేలా నటించారు.కానీ లారెన్స్ చేసిన అరవ అతి అస్సలు నచ్చదు. అతడి నటన.. హావభావాలు ప్రేక్షకులను అసలు మామూలుగా ఇరిటేట్ చేయవు. లారెన్స్ అతికి.. పి.వాసు ఔట్ డేటెడ్ నరేషన్ తోడై.. 'చంద్రముఖి-2' చాలా వెటకారంగా తయారైంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సీన్లను తప్ప 'చంద్రముఖి-2' ఏమాత్రం ఆకట్టుకోలేదు.'చంద్రముఖి'కి.. 'చంద్రముఖి-2'కి అసలు పెద్ద తేడా ఏమి కనిపించదు. కథ దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది. ఒక పెద్ద కుటుంబంలో సమస్య రావడం.. వాళ్లు దానికి పరిహారం కోసం ఒక పూజ చేయడానికి సిద్ధపడటం.. ఇక అందులో భాగంగా చంద్రముఖి ఆత్మ ఉన్న ఇంటికి రావడం.. తరువాత అక్కడ అనుకోని సంఘటనలు జరగడం.. ఇలా మొత్తం 'చంద్రముఖి' సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. కానీ 'చంద్రముఖి' సినిమా చూస్తున్నపుడు కలిగే ఉత్కంఠ.. భయం.. మధ్య మధ్యలో వినోదం.. ఇవేమి ఈ సినిమాలో అయితే కనిపించవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: